My Poems కవితలు

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604
ఆ శవం ఈ దారిలోనే పోవాలి…
అనే రైతుగీతం
గడ్డపలుగు చెలకపార మాట్లాడుకుంటున్నాయి
తమను పట్టుకునే చేతుల కేమైందని
వరి దుబ్బులు అనుకుంటున్నాయి
కలుపు తీసి ప్రేమతో  తమ వేళ్ళు చక్కవొత్తిన చేతుల కేమైందని
నాగలి మేడి కన్నీరు పెట్టుకుంటూంది
తన సోగను పట్టుకున్న చేతుల కేమైందని
ఇంటి వసారాలో మూలకున్న తలపగ్గం ముల్లుగర్రా
గుసగుసలాడుతున్నాయి
ఆ చేతులు తమను ప్రేమతో పొదువుకోవడం లేదేమని
మెట్ట చేలో కోండ్ర తిరిగిన దుక్కి సాళ్ళు
తమ వెంట నడిచిన పాదాల కేమైందని బుగులుకున్నాయి
ఇంటిదారి అరక, కోటేరు వెనుక గీసిన ఏడికర్ర గీత
తనను ప్రేమతో తొక్కిన పాదాల కేమైందని దిక్కులు చూస్తూంది
ఎండిన మబ్బులు చూస్తున్నాయి అతని కళ్ళకేసి
నుదిటి చేత్తో తల పైకెత్తే ఆ నింగిచూపులెక్కడా అని
దమ్ము చేయని వరి మడి..
తన బురద గంధాన్ని అలదుకునే ఆ దేహం ఎక్కడా అనీ…
ఎండిన కృష్ణా గోదావరులు నిండుగా ఎడ్ల జత కళ్ళల్లో…..
బి.టి, మొన్ సాంటో ఏదైతేనేం
ఇక్కడ వేసిన గ్లోబల్ పత్తి విత్తనం
ఏదేశంలో డబ్బుకురిసిందో ఇక్కడ కళ్ళల్లో నీళ్లు విత్తింది
రెండు వేల అడుగులు దిగిన బోరుబావి
గొడ్డు గేదైంది, వడ్డీ సేటయింది
ఇంట్లో నగలను కంట్లో నీళ్ళనీ కాజేసింది
అది ఏరువాక పున్నమి కాదు
నిండు అమాస.. ఎవరు దోచారు ఇక్కడి వెలుగు వసంతాలను
గొర్రుకు పెట్టిన నొగలు పాడెకట్టె లయినాయి
అరకకు కట్టే పగ్గం పాడెకు దేహాన్ని కట్టింది.
ఓ స్వతంత్ర భారత దేశమా ఒక రోజు సెలవు పెడతావా
నీ వెన్నెముకని ఆర్ధో పెడిక్ హాస్పిటల్ లో చూపించాలి
యువతరమా నీ క్రికెట్ ఛానల్ కాసేపు ఆపుతావా
రైతు  శవం దగ్గరి పెళ్ళాం బిడ్డల ఏడుపులు
నేను కాసేపు గుండె నిండా వినాలి
ఓ పార్టీల నాయకులారా మీ రోడ్ షో కాస్త ఆపుతారా
ఒక రైతు శవం ఈ దారిలోనే పోవాలి….
Prof. Pulikonda Subbachary
Director, Internal Quality Assurance Cell
Dravidian University
Kuppam 517426

పులికొండ సుబ్బాచారి

పావురాల గుట్ట

ఇది పితృవనం

నిజాలు ఎన్నో అడుగల లోతులో ఖనితం కాగా

పైన జిల్లేడ్లు మొలిచిన ఛిద్రజీవన రుద్రభూమి

నిజాలు బొందల్లోంచి వాటంతటవే బయటికొచ్చి

ఇప్పుడు పోస్టుమార్టం చేయుంచుకుంటున్నాయి

ఎన్ని కత్తిగాయాలు ఎన్ని బుల్లెట్ దెబ్బలు

ఎన్నివేల ఎకరాలు రణరక్తప్రవాహ సిక్తం కాలేదా

అది సోంపేటా అది గంగవరమా

అది కడలి అంచులన్నింటి ముంచెత్తి కాటేసిన కార్పొరేట్ భూతమా

అది విల్లాలా జిల్లాలా ఓబుళాపురం ఖిల్లాలా

ఏవైతేనేం

క్షతగాత్ర సత్యాలు పోస్టుమార్టం చేయించుకుంటున్నాయి

గాయాలేవైతేనేం

పచ్చపచ్చని పైరు, కడుపునిండా చన్నుకుడిచిన బిడ్డ

అవి గాలికి తెరలు తెరలుగా తెర్లిన ఆనందాలు అడుగుతున్నాయి

మేం స్మశానాల పాలెందు కయ్యామని

పోస్టుమార్టం చేయించుకుంటున్నాయి

ఉదయాలు అబద్ధం అక్కడ సూర్యుడు వర్చ్యువల్

మేఘాలన్నీ అందుకు సాక్షి

చీకటి తన ముఖానికి సంధ్యారుణ వర్ణాన్ని పూసుకుంది

ఈ గాలి తెమ్మెరలన్నీ అందుకు సాక్షి

అది వర్చువల్ సూర్యుడు ఇది పోస్ట్ మార్టం రిపోర్టు

ఏ మేఘం ఇక్కడ వర్షించిందో చీకటి ముఖానికి వేసిన

సంధ్యావర్ణం అదుగో పితృవనంలో గిరికీలు కొడుతూంది

ఈ గాలికి తెలుసు ఈ నేలకు తెలుసు

ఈ నింగీ ఈ నీరు ఎనాటమీ టేబుల్ పక్కనే ఉన్నాయి

తాము చూసిన నిజాన్ని కళ్ళతో చూస్తున్నాయి

గాయపడ్డ నిజాలు, భూమిపైకి వచ్చిన నిజాలు, మిగిలిన శల్యాలు

కార్బన్ టెస్ట్ ల్లో డిఎన్ ఎ పరీక్షల్లో…

ధృతరాష్ట్ర వ్యామోహం కురుక్షేత్రంలో మడుగు ఒడ్డున

తొడలు విరిగి కూలింది ఈ రోజు

పావురాల గుట్ట కొత్తగా కన్నీళ్ళు పెట్టుకుంటూంది

అది చంచల్ గూడ అయితేనేం చర్లపల్లి అయితేనేం

జైలు ఊసలు ఛిద్రమైన జీవితాల్ని తెస్తాయా

పారిపోయిన వసంతాలు కోకిలల్నెక్కడ వెదుకుతాయి

పితృవనాల్లో దాక్కున్న ప్రజాస్వామ్యం..

నిజాలు బయటికొచ్చి పోస్టు మార్టం చేయించుకుంటున్నాయి…

ష్….ష్… ష్… డాక్టర్ బయటికొస్తాడు

మౌనంగా చూడండి

రేపటికోకిల బిందువులని ఏరుకుంటుంది

జాగ్రత్త రెప్పలచాటున నీళ్ళు తొణకొద్దు సుమీ…

పులికొండ సుబ్బాచారి

Prof. Pulikonda Subbachary

Director

Internal Quality Assurance Cell

Dravidian University

Kuppam 517426 A.P

Mobile: 09440493604

psubbachary@gmail.com

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం 517426

మొబైల్ – 9440493604

నా బిడ్డ న్యాయం, తప్పిపోయింది

ఎక్కడైనా చూశారా….

కళ్లకు కట్టిన నల్లని గుడ్డ

నల్ల జెండాలాగా పైకి లేచింది.

గుడ్డ కింది కళ్ళు వర్షాధారలైనాయి

అమ్మా నా బిడ్డ న్యాయం మీ కెక్కడైనా కనిపించిందా

అని అడుగుతూంది న్యాయదేవత.  వెర్రితల్లి

చేతిలోని తరాజు ఒకపక్కకి ఒరిగింది

ఒక పళ్ళెంలో పదికోట్లు పడ్డాయి మరి

నోట్ల కట్టల్నిండా ఇనుపఖనిజం మకిల

పొలం చుట్టూ ఉన్న కంచె చేనంతా పాకింది

అబ్బ అన్నీ ముళ్ళే ….

ఏ గాలి వీచిందో…. న్యాయదేవత వస్త్రాలెగిరిపోతున్నాయ్

జాగ్రత్త జాగ్రత్త జాతీయ జెండానైనా కప్పుదాం

వేల ఎకరాల సస్యకేదారాలలో వేలాది

సంసారాల కళ్ళు వెలిగే నేలల్లో మాఫియా మాయ తిరిగిన

కళ్ళనీలాల గనుల్లో న్యాయదేవత ఆర్తిగా పరుగెత్తుతోంది కన్నీళ్ళతో

ఇంటింటినీ గడ్డం పట్టుకొని బామాలుతుంది

నా బిడ్డ న్యాయం కనిపించిందా అని

తప్పిపోయిన బిడ్డ ఎక్కడ కిడ్నాపైందోనని

కడుపు చించుకు ఏడుస్తుంది కళ్ళకు గుడ్డకట్టి పిచ్చితల్లి

దూరంగా మరో మాతృమూర్తి ఏడుస్తూ వస్తోంది.

ఎవరామె ఒక చేతిలో మువ్వన్నెల జెండా

అవ్వ…!  భరతమాతా? ఎందుకంత రోజుకుంటూ వస్తూంది.

న్యాయదేవత కెదురైంది కన్నీటి స్వరంతో

అమ్మా నా బిడ్డ ప్రజాస్వామ్యాన్ని ఎవరో ఎత్తు కెళ్ళారు

నీ కెక్కడైనా కనిపించిందా..

ఒంగిన తరాజు చేయి పగిలిన జెండా చేయి

ఒకరినొకరు ఏదార్చుకున్నాయి

మళ్ళీ అవే కన్నీటి ప్రశ్నలు

మా బిడ్డలు న్యాయం, ప్రజాస్వామ్యం కిడ్నాపైనాయి

ఎక్కడైనా కనిపించాయా….

(ఒక జడ్జి లంచంతీసుకున్నాడన్న వార్తకు స్పందిస్తూ..)

Prof. Pulikonda Subbachary

Director

Internal Quality Assurance Cell

Dravidian University

Kuppam 517426 A.P

Mobile: 09440493604

psubbachary@gmail.com

పులికొండ సుబ్బాచారి

వెఱ్ఱి తుమ్మచెట్టు

ఈ తుమ్మ చెట్టెందుకో విపరీతంగా పెరిగి పోతూంది

దీనివేళ్ళు చాలా లోనికి ఉన్నాయోమో

చుట్టూ ఉన్న చెట్లకి చిన్న చెట్లకి పూలమొక్కలకీ

చివరికి గడ్డిపోచలకీ నీళ్ళు రాకుండా తాగేస్తూంది

దీనివిత్తనం ఎక్కడినుంచి వొచ్చిందో…

చెరగని సిరా ముద్ర వేసుకున్న వేలికొసల్నించా

ఏ డబ్బుకట్టలో.. ఏ సీసాలో.. మోసుకొచ్చాయా

పావురాల గుట్టమీంచి ఎగిరొచ్చిందా

ఎక్కడ్నించైతేనేం తెలుగునేల నడిబొడ్డున

ఏపుగా ఎదుగుతోంది అబ్బా

దీనిముళ్ళు కళ్లని పొడుస్తున్నాయి దారెట్లా

ఒళ్ళంతా గుచ్చుకుంటున్నాయి వందలు వేలు

లక్షకోట్లు వొళ్ళంతా జర్జరితం అవుతూంది

దీనిపూలు జబ్బుపడ్డాయేమో రాజమాయనంతా పూసినట్లుంది

మహాకంపు దీని పుప్పొడి పీల్చితే
ఒళ్ళంతా కంపు నోరంతా నోట్ల ఆకలితో అరుస్తూఉంది

వేళ్ళు బాగాలోనికున్నాయా… తొవ్వడం అంత సులువా

ఏండ్లు పూండ్లవుతుంది…

చెట్టుక్కట్టిన ఉయ్యాల

ఉయ్యాలలో పాలకై పెట్టిన ఆర్తనాదం

ఉయ్యాల కట్టిన చేయి చేసే ఆకలి గోస తడెండిన నాలుక

దీనికేం పడుతుంది ముళ్ళు పెంచుకుంటూంది

చుట్టూ ఉన్న జనం ఎంత అమాయకులా

దీనిముళ్ళల్లో అందాన్ని తుమ్మపూల అందాన్ని

తాటినీడ స్నేహాన్ని తలచుకు తలచుకు మురుస్తున్నారు

దీని పూల గాలి శ్వాసకోశాల్లోకి పోయిందా

జనంలోకి విషం పారిందా

చచ్చిపోతోంది కూడా తెలీదా

వెఱ్ణి తుమ్మ చెట్టు నాగలికి పనికొస్తుందా వంటచెరుక్కా

దేనికీ కానిది దానికదే స్వామ్యం

వెఱ్ఱితుమ్మచెట్టు ఏపుగా ఎదుగుతోంది

వేళ్ళతో పెకలించాలని

కొంతమందికైనా అనిపించింది

ముళ్ళతో వీపు మొద్దుబారిందేమో

వేళ్ళు లోనికున్నాయి బాగా

వెఱ్ఱితుమ్మ వెల్లకిలా పడుతుందా…

పడుతుంది ఇది చివరికి ఆకలి కుండకింద

ఆరనిమంటై అన్నం ఉడికిస్తుంది

Prof. Pulikonda Subbachary

Director

Internal Quality Assurance Cell

Dravidian University

Kuppam 517426 A.P

Mobile: 09440493604

psubbachary@gmail.com


1 thought on “My Poems కవితలు

  1. నా బిడ్డ న్యాయం, తప్పిపోయింది ఎక్కడైనా చూశారా–ee kavitha naaku chaala nachindhi Sir. kalla ku katinatlu gaa scene create chesi aa kavitvam lo munigi poye la chesaaru. kathi kante kalam gappadi ani nerupinchaaru. Meeku naa johaarlu Sir..

Leave a comment