A NEW BOOK ON RESEARCH METHODOLOGY AND THESIS WRITING

Image

A much awaited book in Telugu finally took a shape. Research methodology has been introduced in small booklets by very experienced researchers like Prof. R.V.S Sundaram, Prof. Gandham Apparao and Prof. Jayaprakash. Theses are no doubt sincere efforts with limited purpose. The present book is also a limited but much wider that suits the researchers and research supervisors in Telugu. It is designed as a complete Style Manual for research in Telugu. I happened to see many Telugu dissertations from various Telugu Departments across India. They did not follow a standard method in making notes, designing the chapters adding appendices and finally making bibliography. Each one followed different style and do not look at a standard book of Style Manual. The present book introduces some international methods and suggests a suitable style and method for Telugu research. The truly serves to the purposes of Researchers and the Researcher Supervisors in Telugu.

Pulikonda Subbachary.

తెలుగులో పరిశోధన విధానానికి సంబంధించి ఇప్పటికే మూడు చిన్న పుస్తికలు వచ్చాయి. వాటిని రాసిన ముగ్గరూ చాలా పరిశోధనానుభవం ఉన్న మంచి పరిశోధకులు. ఇప్పటికీ వీటిని విద్యార్థులు వినియోగిస్తున్నారు. కాని తెలుగులో పరిశోధన విధానానీకీి సిద్ధాంత గ్రంథ రచనకు సమగ్రమైన శైలీ గ్రంథం లేదా స్టైల్ మాన్యువల్ ను ఇప్పటికీ తెలుగు వారు తయారు చేసుకోలేదు. దీనికి కారణాలు చాలా ఉండవచ్చు. ఇలాంటి శైలీ గ్రంథాలను సంస్థలే చేయాలి. వ్యక్తులు చేయవచ్చు కాని సంస్థలు పెక్కు మంది పరిశోధకులు కూర్చుని చర్చించి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టైల్ మాన్యువల్స్ ని వివిధ సంస్థలే అభివృద్ధి చేసాయి. కాని తెలుగు వారిలో ఈ విషయంలో తలలు కూడడం లేదు. అలాంటి సంస్థలు కూడా విశ్వవిద్యాలయ స్థాయిలో మనకు ఏర్పడ లేదు. అకాడమీలు కూడా ఈ పనికి పూనుకో లేదు. మొదటి సారి పూర్తి రూపంలో శైలీ గ్రంథాన్ని తయారు చేసే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా జరిగింది. దీన్ని తొలి ప్రయత్నంగా భావించి తెలుగుశాఖలు ఇంకా సమగ్రమైన శైలీ గ్రంథాన్ని తయారు చేసుకునే పయత్నం చేయాలి. ఈ పుస్తకం వినియోగంలోనికి పూర్తిగా వచ్చిన తర్వాత దీన్ని పాఠకులు ఎలా విస్తృతపరచవచ్చునో తెలియ వస్తుంది.

భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.

అధికార భాష (తెలుగు) అమలు ప్రజాస్వామిక హక్కు

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

“దేశక్షేమానికి భాషాక్షేమమే పునాది” అన్న వేదం వేంకటరాయశాస్త్రి గారి మాటని ఉట్టంకిస్తూ మహోదయం పుస్తకంలో కె.వి.ఆర్ అన్నమాట ఇక్కడ చెప్పాలి. “తర్కానికి నిలవాలంటే ఈ వాక్యాన్ని తిరగరాయాలి” అని అంటాడాయన పుస్తకం మొదటి వాక్యంలోనే. అంటే భాషాక్షేమానికి దేశ క్షేమమే పునాది అని చెప్పాలని ఆయన ఉద్దేశం. కె.వి.ఆర్ వాక్యాన్ని గురించి ఇక్కడ చర్చించే సందర్భం కాదు కాని వేంకటరాయశాస్త్రి గారి వాక్యాన్ని మాత్రం పక్కకు నెట్టవలసింది కాదని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ లో అధికారభాషగా తెలుగు అమలుచేసే పరిస్థితి చూస్తే తెలుస్తుంది.

ఎంతో బలమైన మతం కూడా భాషకున్న శక్తి ముందు తలవంచవలసి వచ్చిందన్నది, ఇక్కడి చర్చకు ఒక ప్రాతిపదిక. దేశాల ఐక్యతకి అనైక్యతకి మతం ఒక బలమైన కారణం. భారత స్వాతంత్ర్యం కొంత ఆలస్యం కావడం దేశవిభజన విషయంలో ప్రాతిపదికన మరొక దేశం విడిపోయే దిశగానే జరిగింది. ఈ రోజున కాశ్మీర్ అపరిష్కృత సమస్యగా మిగిలిపోవడానికి పాకిస్థాన్ అధీనంలోనే దానిలో చాలా భాగం ఉండడానికి కారణం కూడా అదే. చాలా దేశాలు మతప్రాతిపదికనే మనుగడ సాగిస్తున్నాయి. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ భాషాప్రాతిపదికన విడిపోవడం చారిత్రక సత్యం. తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా సుదూర ప్రాంతాలలో భిన్న భౌగోళిక ప్రాంతాలలో ఏర్పడిన దేశం పాకిస్తాన్. పశ్చిమ పాకిస్తాన్ లోని భాష ఉర్దూ (దీనికి హిందుస్తానీ అనే మరొక పేరుంది కాని పాకిస్తానీ అని కాదు). తూర్పు పాకిస్తాన్ లోని భాష బెంగాలీ. కాని అధికార పీఠం ఉంది పశ్చిమ పాకిస్తాన్ లో అందుకే ఉర్దూని అధికారభాషగా దేశం మొత్తంలోను అమలు చేసింది మతప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ ప్రభుత్వం. 1948 మార్చి 21న గవర్నర్ జనరల్ మహ్మదలీ జిన్నా ఉర్దూను అధికారభాషగా శాసనాన్ని జారీ చేసాడు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇక్కడి ప్రజల భాష బెంగాలీ, అధికార కార్యక్రమాలన్నీ ప్రజల భాష అయిన బెంగాలీలోనే సాగించాలి అని ఆందోళన చేసారు. అది పెద్ద ఉద్యమంగా మారింది. 1952 ఫిబ్రవరి 21న ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్ద ఊరేగింపుతో ఆందోళన నిర్వహించారు బెంగాలీ భాషని అధికారభాషగా తూర్పు పాకిస్తాన్ లో అమలు చేయాలనే డిమాండ్ తో. ఈ ఆందోళన కారులను వారి కోరికలను సహించలేని పాశవిక ప్రభుత్వం వారి పైన కాల్పులు జరిపింది. కనీసం 50 నుండి 60 మంది విద్యార్థులు చనిపోయారని అనధికారికంగా సమాచారం ఉంది. ప్రభుత్వం దీన్ని మసిపూసి మారేడుకాయ చేసింది. మాతృభాషని ప్రజల భాషని పరిపాలన భాషగా అమలు చేయించడం కోసం ఇంత పెద్ద బలిదానం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని యునెస్కో గుర్తించి ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న జరపాలని నిర్ణయించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆందోళనని నివారించలేకపోయింది. ఇది మరింత పెద్ద ఉద్యమమైంది. ఈ అధికార భాషకోసమే చివరికి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ నుండి విడిపోయి బాంగ్లాదేశ్ గా అవతరించింది. ఇలా మత ప్రాతిపదికన ఏర్పడిన ఒక దేశం భాషాప్రాతిపదికన విడిపోవడం అన్నది మరెక్కడా జరగలేదు. భాషకున్న శక్తి మతానికున్న శక్తికన్నా బలమైందని ఇక్కడ ఋజువు కావడం సంగతి అలా ఉంచితే. ఒకే మతానికి చెందినా తమ ప్రజల భాషే అధికార భాష కావాలని ప్రభుత్వ వ్యవహారాలన్నీ తమకు తెలిసిన బెంగాలీ భాషలోనే జరగాలి కాని తెలియని ఉర్దూలో కాదని అక్కడి ప్రజలు నిర్ద్వంద్వంగా నిలిచారు. తమకు కావలసింది సాధించుకున్నారు. చివరికి తమ భాషకు ఒక దేశాన్నే సాధించుకున్నారు. భారత భూమినుండి విడిపోవడమే స్వాతంత్ర్యంగా వారు భావించలేదు. తమ భాషలోనే తమ అధికారిక పనులు నిర్వహించుకోగలగడమే నిజమైన స్వాతంత్ర్యం అని వారు భావించారు.

వలసవాద బ్రిటిషు ప్రభుత్వం వదిలిపోయిన ఇంగ్లీషు అధికార భాషనుండి ప్రజలు ఏమేరకు తమ భాషని అధికారభాషగా తెచ్చుకున్నారు, అని దేశ స్థాయిలో అంచనా వేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 1956లో తెలుగు భాష ప్రాతిపదికను తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు మినహాయించి తెలంగాణా జిల్లాలు నవాబు పాలనలో ఉన్నాయి. మహరాష్ట్రలోని కొన్ని జిల్లాలు కన్నడం మాట్లాడే కొన్ని జిల్లాలు కూడా హైదరాబాదు రాష్ట్రంలో ఉండేవి. ఈ అన్ని జిల్లాలలో కలిపి ఉర్దూ మాట్లాడే ముస్లింల సంఖ్య కేవలం నాలుగు శాతానికి మించదు అని అప్పటి గణాంకాలు చెబుతాయి. సుమారు 75 శాతానికి పైగా తెలుగు మాట్లాడే వారు ఉండగా కన్నడం మరాఠీ మాట్లాడే వారు మిగతా వారు ఉండేవారు. కాని నాలుగు శాతం ప్రజలు మాట్లాడే భాష ఉర్దూను అధికారభాషగా అన్ని స్థాయిల్లో అమలు చేసింది నిజాం ప్రభుత్వం. అంతే కాదు ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్య కూడా ఉర్దూలో అందించింది ప్రభుత్వం. కాని అక్కడ బెంగాలీలు చేసిన పనిని ఇక్కడ తెలుగువారు చేయలేకపోయారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1912లో మొదలై 1918లో పూర్తి స్థాయిలో ఏర్పడింది. దేశ భాష ఒకటి బోధనభాషగా విశ్వవిద్యాలయం ఏర్పడడాన్ని ఆహ్వానించాలని అభినందించాలని రవీంద్రనాథ్ ఠాగోర్ ఆనాడు అన్నారు. కాని బెంగాలీ వాడైన ఆయన తెలుగు రాష్ట్రంలో తెలుగు బోధనభాషగా విశ్వవిద్యాలయం స్థాపన కావాలన్న భావాన్ని చెప్పలేకపోయాడు. కాని దీనికి చాలా ముందే ఒక ట్రాన్స్ లేషన్ ప్రాజెక్టును స్థాపించి ఉన్నత విద్యకు చెందిన పుస్తకాలన్నింటినీ ఉర్దూలోనికి అనువదింపచేసే పని చేసింది నిజాం ప్రభుత్వం. ప్రభుత్వాలకు ఇలాంటి ముందు చూపు ఉండాలి. ఎం.బి.బి.ఎస్ ని కూడా ఉర్దూలో అందించగలిగింది. 1948లో స్వాతంత్ర్యం వచ్చే వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధన భాష ఉర్దూనే ఉంది. తర్వాత ఇంగ్లీషు బోధనభాషగా మారింది. అధికారభాష అమలును శాసనంచేసి అలా చేసింది ప్రభుత్వం. తెలుగు వారు నోరువెళ్ళబెట్టారు. లేదా నోరు మూసుకొని ఊరుకున్నారు.

కానీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది 1956లో అయితే తెలుగును అధికారభాషగా అమలు చేయాలని అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసింది 1974లో. అంటే దాదాపు స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేండ్లకు కాని ప్రజల భాషలో పరిపాలన ఉండాలని ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఇక విద్యాబోధనలో తెలుగు బోధన భాషగా ఉన్నత స్థాయిలో కూడా ఉండాలని అందుకు పుస్తకాలు తెలుగులో చేయించడానికి ఒక సంస్థ అవసరం అని గుర్తించింది ప్రాతః స్మరణీయుడైన తెలుగు వాడు పి.వి. నరసింహారావు. ఈ తెలుగు అకాడమీ ఏర్పడింది కూడా 1968లో అంటే స్వాతంత్ర్యం వచ్చిన ఇరవై సంవత్సరాలకి. ఇదీ తెలుగు వారు తెలుగు అధికారభాషగా విద్యాబోధన భాషగా ఏర్పాటు చేసుకోవాలనుకునే కాంక్ష తీరు.

తెలుగు అకాడమీ ఏర్పడిన కొత్తలో బోధనభాషగా తెలుగు  పరిస్థితి కొంత ఆశాజనకంగా సాగింది. ఇంటర్ డిగ్రీస్థాయిల్లో పి.జి స్థాయిలోను విద్యాబోధన సాగడానికి బాగానే కృషి చేసింది. ఇంటర్ పుస్తకాలు డిగ్రీ పుస్తకాలు తెలుగులో బాగా వచ్చాయి. డిగ్రీ వరకు తెలుగు మీడియం బోధన సాగింది. పి.జి బోధన సాగడం చాలా కష్టం అని ఆనాడే తెలియవచ్చింది. కారణం విద్యార్థులలో దీని పట్ల ఆసక్తి లేకపోవడం ఉద్యోగం సంపాదన సాధ్యం కాదనే భావం వారికి ఉండడం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగం సంపాదించే వేదిక మన రాష్ట్ర మే కాదు దేశం లోని ఇతర ప్రాంతాలలో కాని విదేశాలలో కాని ఎక్కడైనా ఉంది అనే అవసరం పి.జి విద్యార్థులను వృత్తి విద్య విద్యార్థులను ఇంగ్లీషు మాధ్యమానికే అంటిపెట్టుకునేలా చేశాయి. అంతే కాదు అఖిల భారత స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు వాటితో వచ్చే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఇంగ్లీషు మాధ్యమం తప్పనిసరి అయింది. దీనితోను విద్యార్థులు ఇంగ్లీషు మాధ్యమాన్ని వీడి తెలుగు  మాధ్యమానికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని చర్యలు ద్వారా రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలోను తెలుగును హిందీని ఆయా ప్రాంతీయ భాషలలోను రాసే సౌకర్యం వచ్చింది. కాని వీటిని కోరుకునే విద్యార్థుల సంఖ్య అరకొరగానే ఉంది. ఉన్నత విద్యలో తెలుగు అమలు పరిస్థితి ఇలా ఉంది. దీనికి కారణం అపరిహార్యంగా ప్రపంచీకరణం తదితర ఇతర కారణాల వల్ల వచ్చే సామాజిక పరిణామాలు విద్యార్థులను అంతర్జాతీయ భాషలో చదవడం తప్పనిసరి అనే భావాన్ని అవసరాన్ని కల్పించాయి. ఈ సాంఘిక గమనాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పని కాదు.

కాని నిత్యం ప్రజలతో సంబంధం ఉండే ప్రజల అవసరాల కోసం పనిచేసే ప్రభుత్వపు అధికార భాష తెలుగు అమలు చేయడానికి ఈ సామాజిక పరిణామ పరిస్థితులు ఏమాత్రం అడ్డం కావు. అలా ఉన్నా కూడా  అధికారభాషగా తెలుగును అమలు చేయవచ్చు. దీనికి కావలసింది కేవలం ప్రభుత్వానికి గట్టి సంకల్పం ఉండడమే. అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడుగా వావిలాల గోపాల కృష్ణయ్య పనిచేశారు. ఆయన ఎంతో చిత్త శుద్ధితో తపించి పనిచేశారని పెద్దలు చెప్పారు. తర్వాతివారిలో ఆచార్య సి. నారాయణ రెడ్డి ఒక ముందు చూపుతో రాష్ట్రం అంతా పర్యటిస్తూ దీని అమలుకు శాయశక్తులా పనిచేశారు. చివరి అధ్యక్షుడుగా పనిచేసిన ఎ.బి.కె ప్రసాద్ కూడా దీని అమలుకు అంకిత భావాన్ని ప్రదర్శించి ఎంతో కష్టపడి తపనపడి తెలుగు అమలు కావాలని పనిచేశారు. ప్రాచీన భాష హోదాతేవాలని కూడా కృషి చేశారు. కాని చాలా సందర్భాలలో అధికార భాషాసంఘం అధ్యక్షుడి పదవి రాజకీయ పునవరావాస కేంద్రం అయింది. తెలుగు భాష అమలుకు, అసలు ఈ రంగానికి చెందనివారిని ఇక్కడ నియమించడం జరిగింది. దీని సభ్యుల నియామకం కూడా రాజకీయ కారణాలతోనే జరిగింది. ఇక దీని కాలపరిమితి దాటిపోయి ఎ.బి.కె పదవినుండి వెళ్ళిన తర్వాత అసలు దీనికి అధ్యక్షుని సభ్యులనూ నియమించడం మానేసింది ప్రభుత్వం. ఇప్పుడీ సంఘం లేనే లేదు. ఇదీ తెలుగు రాష్ట్రానికి తెలుగు అమలు పట్ల ఉన్న చిత్తశుద్ధి, సంకల్పం.

తెలియవచ్చిన గణాంకాల ప్రకారం నాలుగు సంవత్సరాల క్రితం వరకున్న పరిస్థితి చూస్తే 95 శాతం అధికార కార్యకలాపాలకు తెలుగును వినియోగిస్తూ నిజామాబాద్ జిల్లా అత్యధిక స్థితిలో ఉండగా 22 శాతం అమలు చేస్తూ చిత్తూరు జిల్లా చివరి స్థితిలో ఉండింది. ఇక మిగతా జిల్లాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన సుమారు 66 సంవత్సరాల తర్వాత, దేశం లో అక్షరాస్యత శాతం 60 వరకు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది అక్షరాస్యత కాని ఇంగ్లీషులో పనిచేసుకోగలిగే విద్యాధికుల శాతం ఎంత అన్నది లెక్కవేస్తే ఇది ఒక 30 శాతానికి మించక పోవచ్చు. అంటే 70 శాతం మంది ప్రజలు తమ దైనందిన అధికార కార్యక్రమాలను ఇంగ్లీషులో చేసుకోలేరు. వారు చేసుకోగలిగేది వారి భాష అయిన తెలుగులోనే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే తమకు అవసరం వచ్చిన ఏ ప్రభుత్వ కార్యాలయానికి కాని సంస్థకు కాని  పోయినప్పుడు తనకు తెలిసిన తన భాషలోనే పనిచేసుకోగలగడం అనేది తక్షణ అవసరం వారి హక్కుకూడా. ఒక బాంకుకు వెళ్ళిన ఒక వ్యక్తి డబ్బుతీసుకోవడానికి వినియోగించే కాగితం అయితే ఇంగ్లీషులోను లేదా హిందీలోను ఉండడాన్ని చూస్తాడు. తనకు తెలియని భాషలో ఉండడాన వాటిని తెలిసిన వ్యక్తితో చెక్కు రాయించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే బాంకు చెక్కులను బాంకులో అవసరమైన ఇతర ఫారాలను తెలుగులో ముద్రించడం అసాధ్యమైన పనా దీన్ని ఎందుకు ఈ సంస్థలు చేయవు. తన డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నీ తన భాషలో ఉంటే వినియోగదారులు అందరూ బాగా సంతృప్తిగా పనిచేసుకోగలరు కదా. తనకు తెలియని భాషలో ఉండడం వల్ల తన పని  సరిగ్గా జరిగిందో లేదో అనే ఆందోళన అతనికి ఎప్పటికీ అలా ఉండాలా. ఏ ప్రభుత్వ కార్యాలయం విషయంలోనైనా ఇదే మాట వర్తిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే కంప్యూటర్ ద్వారా ఇచ్చే టికెట్ లో ఇంగ్లీషు హిందీలోనే సమాచారం ఉంటుంది. దీనికి తెలుగును కూడా కలపడం ఏమంత కష్టం. ఒక కంప్యూటర్ ఉద్యోగికి నెల రోజుల జీతం ఇస్తే ఈ పని పూర్తిగా అమలు అయ్యేలా చేయగలడే. ఎందుకు చేయడం లేదు. కారణం వారికి దానిపట్ల ఆసక్తి లేదు. వారిని నిలదీసే వారూ లేరు. అఖిల భారత స్థాయి సంస్థల సంగతి అలా ఉంచితే మండల స్థాయిలో నుండి ఆలోచిస్తే తెలుగును ప్రజల భాషలోనికి మారిస్తే దానిద్వారా ప్రజలు పొందే సౌకర్యం మానసిక తృప్తి ఏ స్థాయిలో ఉంటాయో ప్రభుత్వాలు ఆలోచించే స్థితిలో ఉన్నాయా. ఈరోజు ఛానళ్ళ ద్వారా శాసన సభ కార్యక్రమాలన్నీ ప్రజల ముంగిళ్ళలోనికి ప్రసారం కావడం హృదయ పూర్వకంగా ఆహ్వానించదగిన పరిణామం. ప్రజాస్వామ్య సౌధానికి ఇలాంటివి మంచి పునాది అవుతాయి. సభ్యులు అందరూ తెలుగులో మాట్లాడుతూంటే మన స్పీకర్ గారు మాత్రం ఇంగ్లీషులో మాట్లాడతారు. (అప్పుడప్పుడూ తెలుగులోనూ మాట్లాడతారనుకోండి). తెలుగు అర్థం కాని ఇద్దరు లేక ముగ్గురు సభ్యులుంటే వారికి ఉర్దూలో అనువదించి చెప్పగలిగే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మనోహర్ గారూ శాసనసభ కార్యక్రమం మొత్తాన్ని తెలుగులోనే మాట్లాడండి. దీనివల్ల రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి ప్రభుత్వ కార్యక్రమాలు వారి భాషలో తెలుస్తాయి. తెలుగును అన్నిస్థాయిలలో అమలు చేస్తే మైనారిటీలు ఆందోళన చేస్తారని వారి భాష ఉర్దూకు అన్యాయం జరుగుతుందని బాధపడతారని ఓటు బాంకు రాజకీయలు దీనికి కారణం అనే వాదన ఒకటుంది. ఉర్దూ ఎక్కువగా మాట్లాడే ప్రజలున్న ప్రాంతంలో ద్విభాషా పద్ధతిలో తెలుగు ఉర్దూ రెంటినీ అమలు చేయవచ్చు. మార్గాలు లేవా. ఇది నల్లేరు మీద బండినడక కాని ప్రభుత్వాలు తెలుగును అమలు చేయలేక పోవడానికి కారణం, దీనిపట్ల శ్రద్ధలేకపోవడమే.

ఇక న్యాయస్థానాలలో కార్యక్రమాలు ప్రజల భాషలో సాగడం అన్నది అన్నింటికన్నా ఎక్కువ అవసరం. తాము న్యాయంకోసం వకాల్తా వేసే భాష, తన న్యాయవాది మాట్లాడే భాష, అవతలి న్యాయవాది మాట్లాడే భాష చివరికి తనపైన తీర్పును ఇచ్చిన భాష తన భాష కాకపోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఈ ప్రజలు తమ దేశంలో కాక వేరే దేశంలో నివసిస్తున్న పరిస్థితి ఇది అని అందరూ గమనించాలి. తమిళ ప్రజలు తమిళ భాష హైకోర్టు స్థాయిలో అమలు జరపాలని ఆందోళన చేస్తున్నారు. కాని తెలుగు వారు ఏంచేస్తున్నారు.

తమ స్వాతంత్ర్యాన్ని తాము తెచ్చుకున్న ప్రజలు తమ భాషలోనే తమ ప్రభుత్వాలు అధికార కార్యక్రమాలు అన్నింటిని నిర్వహించాలని కోరుకోవడం ఇక్కడి ప్రజల ప్రజాస్వామిక హక్కు. ప్రజల భాషలో అధికారిక కార్యకలాపాలు జరిగినప్పుడే స్వాతంత్ర్యం పూర్తిగా వచ్చినట్లు. పాలకులు మారినంత మాత్రాననే స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం వచ్చినట్లు కాదు. ప్రజల భాషను అధికారిక భాషగా అమలు చేయించుకోవడం చేయడం అన్నది ప్రజలకు సహజంగా సంక్రమించిన ప్రజాస్వామిక హక్కు. అన్నింటి కన్నా చాలా ముఖ్యమైన హక్కు. దీన్ని చేయడం ప్రజాప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. పోరాటంతోనైనా సాధించుకోవడం ప్రజల బాధ్యత.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.

జానపద కథలకు ఆహ్వానం

మిత్రులారా
నేను మా విశ్వవిద్యాలయంలోని మా జానపదవిజ్ఞాన శాఖనుండి తెలుగు జానపద కథలలో అంతర్గతంగా ఉన్న వివిధ సామాజిక వర్గాల వారి మనోభావాలు సామాజిక నిరసన ఎలా ఉంటుంది అనే అంశంపైన యుజిసి వారి మేజర్ రిసెర్చి ప్రాజెక్టుకోసం పరిశోధన చేస్తున్నాను. ప్రస్తుతం వివిధ జిల్లాలనుండి కథలను సేకరిస్తున్నాను. రాయలసీమ జిల్లాలలో కొన్ని సర్కారు జిల్లాలలో కొన్నింటి నుండి కథలు సేకరించాను. ఇక తెలంగాణా జిల్లాలలో నుండి కొన్నింటిని సేకరించవలసి ఉంది. 
తెలుగు వారందరికీ చేసే మనవి ఏమంటే మీకు తెలిసిన జానపద కథలు ఏమైనా ఉంటే పంపండి వాటిని పరిశోధనలో విశ్లేషణకు చేరుస్తాను. వాటిని ఇచ్చిన వారి పేరు పైన ప్రచురిస్తాను. ఈ ఆలోచనను నలుగురితో పంచుకుంటే నేను మరింత కృతజ్ఞుడిని 
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి. 

మనస్తంత్రులు మీటే మాధురీ కవి హంసలదీవి సుబ్బారావు

దీవి సుబ్బారావు

దీవి సుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)

కవిత్వం ఎలా రాయాలో అని తిరిగి కవిత్వంలోనే
చెప్పిన కవులు మనకు చాలామంది ఉన్నారు. లేదా తాను ఎలాంటి కవిత్వం రాస్తున్నానో అని
కవిత్వంలో చెప్పిన కవులూ చాలామంది ఉన్నారు. ఈ సంప్రదాయం ఈనాటి వచన కవులలోనూ బాగా
కనపడుతుంది. తన కవిత్వాన్ని గురించి చెప్పిన కవితలు అసలు కవిత్వం ఎలా ఉండాలో అని
చెప్పిన ఆధునిక వచన కవితలు కూడా మనకు చాలా కనిపిస్తాయి. ఇలా కవిత్వాన్ని గురించి
తిరిగి కవిత్వం రాయడం అనేది ఆనాటి ఆది కవి దగ్గరి నుండి మనకు కనిపిస్తుంది.
ప్రాచీన కావ్యాలలో అవతారికలలో చాలామంది ఈ పని చేశారు. అలా చెప్పిన  ఉదంతాలలో అన్ని కాలాల కవిత్వానికి వర్తించే
పద్యాలు రెండున్నాయి. పదహారో శతాబ్దానికి చెందిన మొల్ల తన రామాయణంలో ఇలా
చెప్పింది.

తేనె సోక నోరు తియ్యన యగు రీతి

దోడ నర్థమెల్ల దోపకున్న

గూఢ శబ్దవితతి గొట్లాడు పని యెల్ల

మూగ చెవిటి వారి ముచ్చటగును.

పదిహేడో శతాబ్దానికి చెందిన రాజకవి, రఘునాథ
నాయకుడు తన వాల్మీకి చరిత్ర కావ్యంలో కవిత్వాన్ని గురించి ఇలా
చెప్పాడు.

చెప్పగవలె, కప్పురములు

కుప్పలుగ  పోసినట్లు, కుంకమపైపై

గుప్పిన క్రియ, విరి పొట్లము

విప్పిన గతి, ఘమ్మనం గవిత్వము సభలన్.

మొల్ల చెప్పిన దాని ప్రకారం నాలుక మీద తేనె చుక్క
పడగానే దాని మాధుర్యాన్ని చటుక్కున రసనేంద్రియం గ్రహించినట్లు కవిత చదవగానే
అర్థమెల్ల గోచరించి మాధుర్యం కలగాలట. అలాకాక గూఢ శబ్ద వితతినుపయోగించి
దూరాన్వయాలతో ప్రౌఢశైలులతో సంక్లిష్టంగా రాస్తే ఆ కవిత మూగచెవిటి వారి ముచ్చట
అవుతుంది అని రాసింది ఆమె. ఆమె రామాయణం కూడా అంత మృదుమధురంగా ఉంటుంది. దాదాపు
ఇలాంటి భావాన్నే రఘునాథ నాయకుడు చెప్పాడు. కప్పురములు కుప్పలు పోసినట్లు, కుంకుమ
పైపై గప్పినట్లు, విరిపొట్లము విప్పినట్లు కవితను చెప్పాలట. అంటే పూలపొట్లం
విప్పగానే పరిమళం నాసాపుటాలకు తగిలినట్లు కవితను చదవగానే దానిపరిమళం మనసుకు
ఆహ్లాదాన్ని కలిగించాలట. ఈ భావాలు ఏనాటి కవితకైనా అన్వయించవచ్చు.

ఆధునిక కవులలో వచన కవితను పండించిన కవులలో దీవి
సుబ్బారావు రాసిన కవిత సరిగ్గా పైన చెప్పిన రీతిలో ఉంటుంది. తేనె చుక్కు నాలుకమీద
పడగానే తియ్యదనం సోకినట్లు విరిపొట్లం విప్పిగానే గుప్పుమనే పరిమళంలా సుబ్బారావు
కవిత మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

తెలుగులోని ఆధునిక వచన కవులలో దీవి సుబ్బారావు
చాలా విలక్షణమైన కవి. ఈ విలక్షణమైన అనే మాట ఆయన వ్యక్తిత్వానికి
కవితావ్యక్తిత్వానికీ చెందుతుంది. ఈయన తన నూత్న యౌవనం నుండీ అంటే 1957 నుండి
కవిత్వం రాస్తున్నా కూడా ఆనాటి నుండి రాసే పాత కవుల లాగా అందరినోటా నానిన కవి
కాదు. తన ఉద్యోగం తాను చేసుకుంటా తన ప్రపంచ విహాయసంలో తాను విహరిస్తూ తన కోసమే కవిత్వంరాసుకున్న
అరుదైన కవి దీవి సుబ్బారావు. ఈయన కవితను ఒక దాన్ని 1957 ప్రాంతంలోనే వేగుంట మోహన
ప్రసాదు చూడడం తటస్థించిందట దాన్నిచూచి ఇది తప్పని సరిగా తెలుగు వారందరికీ
అందాల్సిందేనని భారతి పత్రికకు వెంటనే పంపమని తానే ప్రోత్సహించి పంపేలా చేసాడట.
అప్పటినుండీ భారతిలో సుబ్బారావు కవితలు ప్రచురిస్తూనే వచ్చాడు. కాని ఈయన 1985 దాకా
తన కవిత్వాన్ని సంకలన రూపంలో తేవాలని ప్రయత్నించలేదు. అప్పటికీ తన మిత్రులు కవులు
కవితారసాస్వాదనా పరాయణులు అయిన వారి ప్రోత్సాహంతో..  ప్రోత్సాహంతో అనే కన్నా వారి బలవంతంతో తొలి
కవితాసంపుటిని వైశాఖ సముద్రం అనే పేరుతో తెచ్చారు. అది ఆరోజుల్లో
చాలా మంచి పేరు తెచ్చుకుంది. సుబ్బారావు కవిత్వంలోని మాధుర్యాన్ని అందరూ
ఆస్వాదించారు. తన కవిత ప్రపంచంలోనికి బాగా రాల్సిన అవసరాన్ని ఆయనకూడా గ్రహించవలసి
వచ్చింది. ఇక వెనుదిరిగి చూడలేదు. పరంపరగా తన కవిత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1998లో ఆయన ఉద్యోగ విరమణ చేసిన (తెలుగు అకాడమీ డైరెక్టరుగా) తర్వాత వరుసగా 1999లో హంసలదీవి,
2000లో మాటన్నది జ్యోతిర్లింగం, 2001లో నవనవం, చిన్నప్పుడన్నీ
ఆశ్చర్యమే, అర్థ గౌరవం,
పరమగీతం అనే కవిత సంపుటాలు
ప్రకటించారు. ఇందులో మాటన్నది జ్యోతిర్లింగం అనేది కన్నడ వచనాలకు
తెలుగు అనువాదం. నవనవం అనేది సంస్కృత కాళిదాసు వాల్మీకి వంటి కవుల
ప్రముఖ శ్లోకాలకు అనువాదం తర్వాత వచ్చిన పరమగీతం కూడా బైబిలులోని సాంగ్
ఆఫ్ సాలోమన్
కు అనువాదం. సుబ్బారావు అనువాద కవిత కూడా ఆయన రాసిన అసలు
తెలుగు కవిత అంత మృదుమధురంగా ఉండడం విశేషం. ఇందుకే కేంద్రసాహిత్య అకాడమీ ఈయన అనువాద
కవితకు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

దీవి సుబ్బారావు మిగతా ఈనాటి కవులలాగా తానొక
కవిననే ఐడెంటిటీని ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడకపోవడం తన పలుకుబడిని తన
అత్యున్నత ఉద్యోగం ద్వారా వచ్చిన హోదాని కవిగా తనకు ఉపయోగపడేలా చేసుకోకపోవడం ఇతర
కవులలాగా కవిసమ్మేళనాలలో పాల్గొనకపోవడం అనేవి ఈనాటి కవులలో ఇతడిని చాలావిలక్షణ
కవిగా నిలిపాయి. బాహిరమైన ఈలక్షణాలే కాదు ఆంతరికంగా ఈయన వ్యక్తిత్వం కవితా
వ్యక్తిత్వం కూడా ఈ వైలక్షణ్యాన్ని కలిగి ఉన్నాయి. కేంద్రసాహిత్య అకాడమీ
పురస్కారాన్ని కూడా పొందిన కవి ఇంకొకరైతై ఎంతగా కవితా లోకంలో తన పేరును తళతళా మెరిసేలా
చేసుకునేవారో. కాని దీవి సుబ్బరావు ఈ కోవకు చెందక తన ప్రపంచానికి తాను పరిమితమై
పోవడం అనే గుణమే తన కవితకు ఈ మాధుర్యాన్ని తెచ్చిపెట్టడానికి కారణమేమో అని
అనిపిస్తుంది. అసలు
తెలుగులో కవిగా బాగా పేరు తెచ్చుకోవాలంటే మంచి కవిత్వం రాయడంతోపాటు దానికి
భిన్నమైన చాలా పనులు చేయవలసి ఉంటుంది. చాలా సీనియర్ చాలా పేరున్న ఒక ప్రముఖ
సాహిత్య విమర్శకుడు హైదరాబాదులో ఒక పెద్ద సాహిత్య సభలో మాట్లాడుతూ ఒక మనిషిని
మహాకవిని అమాంతం చేయగల బ్రోకరు సంస్థలు హైదరాబాదులో చాలా ఉన్నాయి అన్నాడు. అంతే
కాదు ఈ రాజకీయాలన్నింటినీ అలా ఉంచి కవిగా గుర్తింపు పొందడానికి ఏదో ఒక శిబిరంలో
గుంపులోనూ ఉండవలసిన అవసరం ఉంది. కాని దీవి సుబ్బారావు ఇవేవీ చేయకపోవడం తనదీవిలో
తానుండి కవిత్వం రాయడం చేయడమే ఈయన్ని ఒక విలక్షణ కవిగా చేస్తూంది. ఈయన కవితలోని
మాధుర్యాన్ని అందించే చిన్న ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నాను.

దీవి సుబ్బారావు కవితలో తెలుగు పలుకుబడి తన సహజ
సౌందర్యాన్ని అద్దంలో చూచుకున్నట్లు చూచుకుంటుంది. తను చూచిన దృశ్యాలను అత్యంత సహజ
సుందరంగా తేనె సోకినట్లు అత్యంత సరళంగా కంటికింపుగా చూపే నైపుణ్యం ఈయన ప్రతి
కవితలో కనిపిస్తుంది. పదాలకు రంగు రుచి వాసన ఉంటాయనే విషయం ఈయన కవిత చదివిన తర్వాత
మరింత బలంగా తెలుస్తుంది. పదాలతో చిత్రాలను గీసి పాఠకుడి కళ్ళముందుంచడం రాగరంజితం
చేయడం అడుగడుగునా పరచుకొని కనిపిస్తుంది. ఇందుకు వైశాఖ సముద్రంలోని
ప్రతికవితనూ మచ్చుగా చూపవచ్చు. దీనికి తొలిగా శీర్షిక కవితనే పరిశీలించవచ్చు. వర్షం వెలిసిన సమయాన/ఆకాశవీధిలో పోతుండగా/
వర్షుకాభ్రములు చిందినయ్ కాబోలు/ సముద్రం ఒడ్డున రథాన్ని దింపి/ చక్రాలు
కడుగుతుండగా/ మీరు నమ్మరు గాని/ సూర్యుణ్ణి నేను చూశాను
. సముద్రంలో సూర్యాస్తమయాన్ని లేదా సూర్యోదయాన్ని చాలా మంది
కవులు వర్ణించారు. కాని ఇలాంటి దృశ్యాన్ని కమనీయరాగరంజిత రీతిని మరెవరూ చూపలేదు.
సముద్రం ఆవలి దిఙ్మండలంలో దిగిన సూర్యుడు ఈ కవికి ఎలా కనిపించాడంటే సముద్రం ఆవలి
ఒడ్డున తన రథాన్ని దింపి తన రథ చక్రాలను కడుక్కుంటున్నట్టుగా ఉంది అని చెప్పిన ఈ
కవి కవితాప్రతిభను సంప్రదాయ పద్ధతిలో అంచనా వేయడం కష్టం. దీన్ని ఏ అలంకారం అని
చెప్పడమూ సరిగ్గా కుదరదు. ఈ ఊహాపోహళింపు అత్యంత నూతనం, తనదే అయిన ముద్ర.
ఇక్కడింకొక విషయాన్ని గమనించాలి. దిఙ్మండలంలో కనిపించే సూర్యుడు రథ చక్రంలా ఉన్నాడని
చెప్పడం. కవి సమయం ఏమంటే సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుందని. కాని ఈయన చక్రాలు
అని అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ వర్ణన
అంతా సరికొత్త పరిమళం. సముద్రాన్ని గురించి ఈ వైశాఖ సముద్రం
సంకలనంలో చాలా చోట్లఉంది. సముద్రం నా గదిలో ఉంది దానిఘోష ఇక్కడే వినిపిస్తదుంది
అంటారు. ఇక్కడ గదిలో కాదు ఆయన మదిలో ఉంది. కారణం ఆయన వైశాక సముద్రం ఒడ్డునే చాలా
కాలం ఉన్నారు. కొన్ని చోట్ల సుబ్బారావు వర్ణన వీడియో దృశ్యాలను తలపిస్తుంది.
సముద్రం మహాగడుసు/ చూట్టానికి ముదురు నీలంగా
కన్పట్టి/ చేతిలోనికి తీసుకొంటే వేళ్ళ మధ్యగా/ రంగు జారిపోతుంది / నమ్మి
దగ్గరికొచ్చిన ఆడకూతుర్ని / మగాళ్ల ముందు మోకాళ్ల దాకా తడిపి / మోట సరసమాడుతుంది./
కర్రపుల్లో గొడుగు కర్రో విసిరేస్తే/ తర్ఫీదు ఇచ్చిన కుక్కపిల్లలా తెచ్చి
ఇస్తుంది/ మోసపోయి హవాయి చెప్పులందిస్తే/ ఒకటిచ్చి రెండోది ఎక్కడో పారేస్తుంది./
వర్షం నీరు పారి ఫర్లాంగు దూరం సముద్రం / తడిసిన నీలం రంగు కోకకు/ ఎర్ర బోర్డరు లా
ఉంది/ తాంబూల చర్వణంతో ఎర్రబడ్డనాలుకను తప్పి చూసుకున్నట్లు ఉంది
. ఇలా సాగుతుంది ఉపమాన పరంపర. ఇక్కడి వీడీయోచిత్రీకరణ కూడా
కమనీయం గమనీయం. ఆంధ్రవిశ్వవిద్యాలయపు తరగతి గదిలో కూర్చుంటే ఆరోజుల్లో సముద్రపు
తీరం కనిపించేది అలల హోరు వినిపించేది. ఈయన అక్కడే ఎం.ఎ ఇంగ్లీషు
సాహిత్యాన్నిచదువుకున్నరోజుల్లో తాను పొందిన అనుభూతిని అణువణువునా జీర్ణించుకోవడం
గ్రహించాలి.  దీవి సుబ్బారావు ప్రకృతి
వర్ణన ఇంత సాదా సీదాగానే కాదు వినూత్నంగా చాలా తాత్త్వికంగా కూడా ఉంటుంది. చీకటిని
వర్ణించిన తీరు ఇక్కడ చూడవచ్చు. చీకటి రాల్తోంది పైనించి / కొండలమీద/ చెట్లకొమ్మలమీద/ పొలాలమీద/
పట్టణం పొలిమేరలమీద/ దోవకిరుపక్కలా గుట్టలుగా గుబుర్లుగా పోగులు పడి
పేరుకుపోతోంది/ చీకటిని పీల్చి గాలి నల్లబడింది
. ఒక ప్రాచీన కావ్యశాస్త్ర కారుడు కవికి ప్రపంచం చాలాభిన్నంగా
కనిపిస్తుంది. అతను చూచిన రీతినే ప్రపంచం మారిపోతుందని ఒక శ్లోకంలో రాశాడు. ఇక్కడ
సుబ్బారావు కవితలో ఈ గుణం కనబడుతుంది. చీకటికి లేని భౌతిక గుణాన్ని చీకటికి
ఆపాదించి ఇనానిమేట్ ని ఏనిమేట్ గా అంటే నిర్జీవగుణ ప్రకృతికి జీవగుణాన్ని ఆపాదించి
చెప్పిన రీతి అప్పటికి చాలా సరికొత్త లక్షణం. చీకటి పైనుండి రాల్తూంది అని చెప్పడం
పోగులుపడి పేరుకుపోతుంది అని చెప్పడం చీకటిని పీల్చి గాలి నల్లబడింది అని చెప్పడం
ఈ కవిప్రతిభకు నికషోఫలమైన అభివ్యక్తులు మాత్రమే కాదు, ఆధునిక తెలుగు కవితలో ఒక
వినూత్న ధోరణిని ఆహ్వానించడమే. అరవైయ్యో దశకంలోనే ఈయన తెచ్చిన ఈ రీతి తర్వాత
ఎనభైయ్యో దశకంలో వచ్చిన యువకవులకు మార్గదర్శకమైంది. ఈ రీతిని వారు అందిపుచ్చుకొని
మరింత పరివర్థితం చేశారు. ఈయన కవితలో సంప్రదాయ ఉపమాలంకారాలు, రూపకాలు కూడా బాగానే
కనిపిస్తాయి. కానీ ఏమాత్రం సాంప్రదాయికం కాని కవిసమయం కాని పై విధమైన వర్ణనలూ
అడుగడుగునా కనిపిస్తాయి. చీకటి అంతటినీ ముంచెత్తిన ఉప్పెనలా ఉంది/ గీస్తున్న
రంగుల వెలుగు చిత్రం చెరిపేసి కరక్కాయ పూసిన కాన్వాసులా ఉంది
. సుబ్బారావు
తన శైలిలో ఇలా ఒక ఉపమానాన్నివేసి ఆపరు పరంపరగా ఒక ఐదారు ఉపమానాలు వరుసగా వేస్తే
గాని తృప్తి చెందరు. ఈ కవితలో ఇలా ఉంటుంది పరంపర. ఇంకొక భావవీచిక గమనిద్దాం.
సూర్యుణ్ణి ఈయన ఎలా వర్ణిస్తాడో ఇక్కడ గమనించవచ్చు. రాత్రల్లా రోజుకుంటూ/చీకట్లో పడి ఈదుకుటూ/తల
పైకెత్తుకొని మబ్బుల్ని తోసుకుంటూ/తెల్లవారు ఝాముకి/ తూరుపు కొండ కొమ్మెక్కి /
లోకం మీదికి తొంగి చూస్తాడు/ లోకం రంకుది/ రాత్రల్లా చీకటి మొగుణ్ణి పక్కలో
పెట్టుకొని/ డ్యూటీనుండి వచ్చిన సూర్యుడికి/ ఏమెరగనట్టు తలుపు తీస్తుంది/ అలసిన
సూర్యుడికి లోకం అప్సరసలా కనిపిస్తుంది./ కౌగిట్లో ఒదిగినదాన్ని/పాపాన్ని
పొదిగినదాన్ని/ మరీ మారుమూల ప్రదేశాల్లో తప్ప/ అన్నిచోట్లా తడిమి/ సున్నితంగా
ముద్దెట్టుకుంటాడు/ లోకం నాటకాలు సూర్యుడి ముందు సాగుతవి.
ఈకమనీయ దృశ్యంలో కనిపించే సూర్యుడు ఇంతకు ముందు
ఏ కవితలోను మనకు కనిపించలేదు. అంతే కాదు. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు అని
సర్వజగత్ సాక్షి అనే సాంప్రదాయిక భావనను పక్కకు తోసి లోకం నాటకాలు సూర్యుడి ముందు
సాగుతవి అని చెప్పడం ఒక మలుపు కొసమెరుపు.

వైశాఖ సముద్రం తర్వాత దీవి సుబ్బారావుకు మంచి
పేరు తెచ్చిన మరొక కవిత సంకలనం హంసల దీవి. ఈ సంకలనం వచ్చిన తర్వాత
ఈయనను తెలిసిన వారు దీవి సుబ్బారావు అని కాక హంసలదీవి సుబ్బారావు అని పిలవడం
ప్రారంభించారు. ఇది కూడా ఒక విలక్షణ కవితా సంపుటం. ఇందులో వివిధ జీవన రంగాలకు
చెందిన మహావ్యక్తులను గురించి వర్ణించడం ఉంది. వీరినే ఈయన పరమ హంసలు అని హంసలు అని
చెబుతూ వారు నిలిచిన ఈ పవిత్ర భూమే హంసలదీవి అని హంసల దీవికి కొత్త అర్థాన్ని
చెప్పి ఆ మహావ్యక్తులను గురించి వర్ణించారు. ఈ కవితలు ఏవీ కూడా పైకి కవితల్లా
కనిపించవు. కేవలం శుద్ధ వచనాన్ని రాసుకుంటూ పోయినట్లు ఇందులో ఏమీ కవిత్వం సొబగులు
లేనట్లు కనిపిస్తుంది. కాని ఈ కవితల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వీటిలో ఈయన తెచ్చిన
కొత్తదనం కొత్త పోకడ కనిపిస్తుంది. ప్రతి కవితలో ఆహా అనే చమత్కారం ఒక అద్భుత
దృశ్యమాలిక కనిపిస్తుంది. నిధిచాల సుఖమా (ఇది నిధి చాలసుఖమా రాముని సన్నిధి చాల
సుఖమా అనే త్యాగరాయ కృతిలోని మొదటి శకలం) కవితలోనే విశ్వనాథ సత్యనారాయణ గారి
జీవితంలో జరిగిన ఒక సంఘటనను వర్ణించారు. రామాయణ కల్పవృక్షం రాసినందుకు తన సొంత
ఊర్లో నందమూర్లో సన్మానం జరిగిన తర్వాత వెనక్కి పోతూ బెజవాడలో రామవరప్పాడు దగ్గర
ఆగి చీకట్లో గోడచాటుకు వెళ్ళారు. అక్కడొక గాయకుడు మనోహరంగా పాడుతున్నాడు. ఈయన తనకు
ఇచ్చిన దండ, ఆపిల్ పండ్లు, ఇచ్చి శాలువా కప్పబోయాడు ఆ యువకునికి. ఆగాయకుడు
వేయించుకోలేదు. నూటపదార్లకట్టనీ (ఆరోజుల్లో అది ఈనాటి కొన్ని వేలతో సమానం) ఆ
గాయకుడు అంగీకరించలేదు పళ్ళు చాలు కోసుకొని తింటాం అని అన్నాడు. తెలీదేమో నీకు/ విశ్వనాథ సత్యనారాయణగారు వీరు/ నీ
కంఠస్వరానికి మెచ్చి/ చేస్తున్న సన్మానం ఇది/ తిరిగి ఇవ్వకూడదు తీసుకో అని/
సర్దిచెప్పబోయారు/ అప్పుడే అక్కడికొచ్చిన శిష్యులు/ అందుకా యువకుడన్నాడు  నవ్వుతూ అమాయకంగా/ సన్మానం ఏమిటండీ రాముణ్ణి
తలచుకున్నందుకు అని/ ఆ దెబ్బకు వారం రోజులు కోలుకోలేదు/ అంత పెద్ద కవి సమ్రాట్టు/
రాముణ్ణి తలచుకున్నందుకేగా/ కల్పవృక్షం రాసినందుకేగా/తనకింత సన్మానం/ ఇది
చెప్పుకుని బాధపడేవాడు/ అసలైన ఆప్తులు కనిపించినప్పుడు
ఇలా సాగింది ఈ కవిత. ఇది కవితలా పైకి కనిపించదు.
వాక్యాలలో చమత్కారం కాని విరుపులు కాని వైచిత్రి కాని లేవు. కాని ఒక సంఘటనకు
చెందిన వర్ణన ఉంది. ఇందులోని చమత్కారం మనస్సుకు తగిలినప్పుడు ఒక అందమైన కవిత
గుండెలో తాకిన చప్పుడు అవుతుంది. సన్మానం ఎందుకండీ రాముణ్ణి తలచుకున్నందుకు
అన్న ఒక్క వాక్యం ఈ కవిత మొత్తంలో కిరీటంలా కనిపిస్తుంది. రాముణ్ణి
తలచుకున్నందుకేగా తనకింత సన్మానం
అని విశ్వనాథ బాధపడి ఆప్తులకు
చెప్పుకోవడం అనే అంశాన్ని ఈ కవితా శీర్షిక నిధిచాలసుఖమా అనే దానితో
అనుసంధానించి చూస్తే ఇందులోని స్వారస్యం తెలుస్తుంది. అంతే కాదు ఒక చారిత్రక
వాస్తవాన్ని కవితాప్రక్రియలోనికి తెచ్చి బంధించి రికార్డు చేయడం కూడా ఇక్కడ
కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ కవితాప్రక్రియ ఆధునిక కవితాప్రక్రియలలో ఒక కొత్త
ప్రక్రియగా కనిపిస్తుంది. కొన్ని చారిత్రక అంశాలు హంసలదీవి కవితల్లో రికార్డు అయి
వీటిని ఆధునిక చారిత్రక కవితలు అని కొత్త వింగడింపుతో పరిశీలించడానికి అనువుగా
కనిపిస్తున్నాయి.

ఈ హంసలదీవి కవితల్లో మరొక ప్రక్రియాపరమైన
వైలక్షణ్యం కనిపిస్తుంది. అదేమంటే ఇది వచనానికి పద్యానికి ఉన్న హద్దుల్ని
చెరిపేసింది. దీన్ని వచనం అని చెప్పాలన్నా లేక వచన రూపంలో ఉన్న కవిత అనాలన్నా లేదా
ఆధునిక ప్రక్రియగా ఉన్న వచన పద్యం అని చెప్పాల్నా అనే విచికిత్స ఇక్కడ అవసరం
అవుతుంది. ఆధునిక వచనకవితకున్న బాహ్యరూపాన్ని దీవి సుబ్బారావు ఇక్కడ సరికొత్తగా
తీర్చి వచన కవితకు కొత్త సొబగు దిద్ది కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇందులో భామతి
అనే కవిత పైగంబరు మహమ్మదు గురించి రాసిన కవిత హృదయాన్ని కదిలిస్తాయి.
కాని ఇందులో అత్యంత సాదాసీదా వచనమే సాదాసీదా వాక్యాలే కనిపిస్తాయి. అసలైన కవితకు
పైరూపం పై పొట్టులాంటిదే అని చెప్పడానికి ఈ కవితలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఆదిభట్ల
నారాయణ దాసు, గాలిబ్, అనీసుర్ రహ్మన్
లను గురించి రాసిన కవితలు మంచి చారిత్రక
సాక్ష్యాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. ఆధునిక వచన కవితల్లో సుబ్బారావు హంసలదీవి
కావ్యం ఒక విలక్షణ నూతన ప్రక్రియగా నిలిచి పోతుంది. సాంప్రదాయికంగా సాహిత్యవిమర్శ
చేసే వారెవరూ దీన్ని గురించి ఇలా చూడకపోవడాన్ని కూడా గమనించాలి.

దీనితర్వాత దీవి సుబ్బారావు ప్రపంచంలోని మంచి
కవిత్వాన్ని తెలుగులోనికి తెచ్చే ప్రయత్నం చేశారు. సూఫీకవిత్వం, నవనవం, పరమ
గీతం, మాటన్నది జ్యోతిర్లింగం అనే గ్రంథాలు
ఇవే. వీటిల్లోనూ దీవి
సుబ్బారావు తన ముద్రను చూపారు. తేనెసోక నోరు తియ్యనగు రీతిని తన మృదుమధురమైన తేనె
శైలిలో రచించారు. వీటిలో దేన్ని ఉదాహరించినా తిరిగి ప్రత్యేక విమర్శనా గ్రంథాన్ని
రాసేంత బాగుంటాయి. ఈ అనువాదాలకే ఈయనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. చిన్నప్పుడన్నీ
ఆశ్చర్యమే
అనే మరొక కవిత సంకలనం కూడా దీవి సుబ్బారావు కవితాప్రతిభకు సరళ
సుందరశైలికి ఆయన తెనుగు నుడికారానికి నికషోఫలంగా నిలుస్తుంది. కృపావర్షం
అనే కథల సంపుటి ఒక కవిత సంపుటిలా కనిపిస్తుంది. అర్థగౌరవం అనే
నాటికా సంకలనం కూడా మంచి కవితలా సాగుతుంది.

దీవి సుబ్బారావు అటు వ్యక్తిగానూ ఇటు తన
కవితల్లోనూ ప్రత్యేకమైన దీవిగా ఒక విలక్షణతను ఆపాదించుకొని కనిపిస్తారు. 1957
నుండి కవిత్వం రాసినా తెలుగుకవిత్వంలో వచ్చిన ఏ కవిత్వోద్యమాలు ఈయన కవితలో
కనిపించవు. అసలు ఆ ప్రపంచాన్నే ఈయన పట్టించుకున్నట్లు కనిపించదు. ఏ సాంఘిక
సిద్ధాంతాలు, రాజకీయాలు, రాద్ధాంతాలు ఈయన కవితలో కనిపించవు. ఇలా చెప్పడం ఒక లోపంగా
కాదు ఒక గుణంగానే. ప్యూర్ పొయట్రీని చదివే అనుభూతి ఈయన కవితోల కనిపిస్తుంది. ఈయన
ప్రకృతి సౌందర్యారాధన, ఈయనదైన ప్రపంచం, ఈయనదైన తాత్త్విక దృష్టి, సంతృప్తజీవనుడైన
వ్యక్తి పొందే నిరామయానందచంద్రిక ఈయన కవిత్వం అంతటా పరచుకొని కనిపిస్తుంది.
ఆంగ్లసాహిత్యాన్ని కంఠదఘ్నంగా చదివిన దీవి సుబ్బారావు అటు సంస్కృత సాహిత్యాన్నీ ఒక
ప్రేమైక దృష్టితో చదివినట్లు ఈయన అనువాదాలు తెలియజేస్తాయి. తనదైన ప్రపంచాన్ని
సృష్టించుకున్న ఒక కవి మధురోహలు తేనె జాలులను దీవి సుబ్బారావు కవితలో అణువణువునా
ఆస్వాదించవచ్చు. ఆధునిక తెలుగు కవులలో ఒక విలక్షణ కవి దీవి సుబ్బారావు అందుకే మరొక
విలక్షణ కవి ‘మో కంటపడ్డాడు మెప్పు పొందాడు.

పులికొండ సుబ్బాచారి.

శతాబ్దాల దళిత గాయం- ఎండ్లూరి సుధాకర్ గోసంగి కావ్యం

తెలుగు కవిత్వంలో దళిత కవిత్వం అనే ఒక ప్రత్యేక మైన వింగడింపు ప్రారంభమై చాలా కాలమే అయింది. 1980 దశకంలోనే ఇది స్ఫుటంగా ముందుకు వచ్చింది. అయితే ఇంతకు ముందు ఉన్న కవిత్వంలో దళితుల ప్రస్తావన కాని వారి గురించి రాయడం కాని లేదని కాదు. అది ఈ పేరుతో ప్రత్యేకంగా లేదని చెప్పడమే. ఈ మధ్యకాలంలో దళిత కవిత్వం కొంత గతానుగతికం అయిన నేపథ్యంలో కొంత స్తబ్ధత ఏర్పడిన స్థితిలో ఎండ్లూరి సుధాకర్ ఇటీవలే ప్రత్యేక పుస్తకంగా ప్రకటించిన గోసంగి ఆ మంచును విరిచింది. శ్రీ కృష్ణదేవరాయల వారి పంచశత వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఒక వైపున ఉత్సవాలకు సన్నద్ధత జరుగుతూ ఉండగా జూలై 3 వ తారీకు 2010న సుధాకర్ ఈ దీర్ఘకవితను రాశాడు తర్వాత మరి రెండు రోజులకు ఒక దిన పత్రికలో పూర్తి రూపంతో ప్రచురితమైంది. ఇటీవలే ఇది గ్రంథ రూపంలో బయటికి వచ్చింది.
శ్రీ కృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవంతో సంబంధం లేకుండా ఇది వచ్చిన సందర్భాన్ని మరొక కోణంలో విశ్లేషణ చేస్తే ఈ కావ్య సృష్టికున్న మరొక కోణాన్ని కూడా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో దళితుల సమస్య ఒక దశాబ్దంనుండి మరొక మలుపు తిరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వారు దళితులకున్న సామాజిక సమస్యను అంటే దళితుల రిజర్వేషన్ లో జరుగుతున్న సామాజిక అసమతుల్యతను ప్రశ్నిస్తూ వచ్చిన ఉద్యమం కారణంగా తెలుగు దళితులు రెండు శిబిరాలలోనికి విభాజితమయ్యారు. ఈ విభజన చాలా కాలంనుండే ఒక చారిత్రకంగా వస్తూ ఉన్నదే అయినా ఈ ఉద్యమం ద్వారా ఈ రెండు ప్రధాన వర్గాల మాదిగ మాలలోని మేధావులు సృజనాత్మక కృషిచేసే వారు అందరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో దళితులు అంటే మాదిగలు మాలలే కాదు చాలా మంది ఉన్నారన్న స్పృహను సమాజంలోను అన్ని వర్గాల వారికి కలిగించాలనే బలమైన ఆలోచన మాదిగ మేధావులలో కలిగింది. సుధాకర్ గోసంగి కావ్యం రాయడానికి కృష్ణదేవరాయల పట్టాభిషేక ఉత్సవాల కాలం ఒక మిష అయితే దళితులలోనే ఇతర ఉపకులాల వారికి సంబంధించిన విషయాన్ని ప్రముఖం చేసి కావ్యసృజన చేయాలన్నది అసలు కారణంగా లోలోపలికి చూస్తే తెలుస్తుంది. గోసంగి కులాన్ని ఆముక్తమాల్యద కావ్యానికి వ్యాఖ్యానం రాసిన వేదం వేంకటరాయశాస్త్రిగారు మాలదాసరిగా మార్చిరాశాడని దీనివల్ల స్వతంత్ర అస్తిత్వం ఉన్న గోసంగి కులానికి అన్యాయం జరిగిందన్నది సుధాకర్ వాదన. ఈ కవితకు ఇతను కూర్చిన నిమ్నటిప్పణిలో ‘కృష్ణదేవరాయులు తన విజయ యాత్రలలో భాగంగా తెలంగాణాలో విస్తృతంగా పర్యటించాడు. అక్కడే ఇతను గోసంగిని చూచి ఉంటాడు లేదా గోసంగిని గురించి విని ఉంటాడు’. అని సుధాకర్ అంటాడు. ఈ విషయజ్ఞానంతో గోసంగిని గురించి రాయలు రాస్తే ఇతన్ని ఇతని అస్తిత్వాన్ని మాలదాసరిగా మార్చింది వేదం వేంకట రాయశాస్త్రి అని ఇలా వేదం వారిది పెద్ద తప్పిదంగా సుధాకర్ భావించాడు. ఈ పుస్తకానికి చాలా విపులమైన చారిత్రక భూమికను, విలువైన పీఠికను రాశాడు మరొక కవి, పరిశోధకుడు సీతారామ్. సీతారామ్ చాలా పరిశ్రమించి విలువైన ఆలోచనలు చేశాడు. అంతేకాదు చాలా నిజాయితీతో వేదం వేంకటరాయశాస్త్రిగారి కన్నా ముందు కూడా చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి అవి కూడా చూస్తే తప్ప మాల దాసరిగా ఎవరు మార్చారు అన్నది చెప్పలేము అని అన్నాడు. ఇది మంచి పరిశోధక లక్షణం. ఆముక్తకు వ్యాఖ్యానాలు రావడం 1650 నుండే మొదలైంది. అంటే అచ్చు యంత్రాలు భారత దేశంలో అడుగు పెట్టక ముందు తాటాకు ప్రతులకు పుత్రికలురాసుకునే కాలంనుండి అన్నమాట. ఈవ్యాఖ్యానం రాసిన వారు కాని వీటికి పుత్రికలు రాసిన వారు కాని చేతివాటం చూపి ఉండవచ్చు. నిజానికి మాలదాసరి అనే మాటను మొదటిసారి ప్రయోగించింది వేదం వారు కాదు. వావిళ్లవారు ఆముక్త ప్రతులు ప్రచురించడం 1869లోనే ప్రారంభం అయింది. వీరి రెండోది 1886లోను మూడో ప్రచురణ 1909లోను నాలుగో ప్రచురణ 1914లోను రాగా తర్వాతిది 1927లో వచ్చింది. వేదం వారిది కూడా 1927లోనే వచ్చింది. కాగా నాకు 1914 లో అచ్చయిన వావిళ్ళవ్యాఖ్యాన గ్రంథం లభించింది. దీనికి విజయనగరం రాజా వారి కళాశాల సంస్కృత పండితులు మేడేపల్లి వేంకటరమణాచార్యులవారు 79 పేజీల అత్యంత విపులమైన అత్యంత విలువైన పీఠికను సమకూర్చారు. ఇందులో ఈయన మాలదాసరి అనే మాటనే వాడారు. అంటే వేదం వారి వ్యాఖ్యానం కన్నా ముందే మాలదాసరి అనేమాటను వాడడం కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏమంటే ఆరో ఆశ్వాసంలో ఉన్న 138 గద్య పద్యాలలో ఎక్కడా మాలదాసరి అనే పదం ఉపయోగించలేదు. కృష్ణదేవరాయలు ఎక్కడా మాలదాసరి అని పద్యంలోగాని గద్యంలోగాని రాయలేదు. ఒక్క 64 వ పద్యంలోనే కందపద్యంలో గోసంగి అనే మాటను వాడాడు. ఇదీ ప్రాస స్థానంలో ఉంది కాబట్టి దీన్ని ప్రక్షిప్తం అని వేరే వారు ప్రవేశ పెట్టారని చెప్పడానికి వీలు లేదు. ఇక అన్ని స్థానాలలోను దాసరి అనే మాటనే వినియోగించాడు. సురియాళు వైష్ణవుడు అనికూడా అన్నాడు. ఎమెస్కో వారు ప్రచురించిన ఆముక్తమాల్యద పుస్తకానికి విశ్వనాథ సత్యనారాయణ గారు పీఠికను సమకూర్చారు. ఈ ప్రతిని రావూరి దొరస్వామి శర్మ గారు పరిష్కరించారు. ఈయన ఈ ఆశ్వాసంలో ఉన్న కథకు మొత్తానికి మాలదాసరికథ అనే పేరు పెట్టాడు. అలా అలా ఇది మాలదాసరికథ అని ప్రచారంలోనికి వచ్చింది. దాసరిని మాలదాసరిగా చేయడం అనే విషయం అలాగే గోసంగిని మాలదాసరిగా చేయడం అనేవి ఈనాడు ప్రశ్నలుగా నిలిచాయి.
ప్రభుత్వం వారు చేసిన సర్వే ప్రకారం గోసంగులు అనే కులం వారు సర్కారు జిల్లాలలోనే ఉన్నారు. తెలంగాణాలో ఈ కులం వారు లేరు. కాని ప్రభుత్వం వారు చేసిన సర్వే సమగ్రం అని చెప్పడానికి వీలు లేదు. తెలంగాణాలో ఉండే ఇతర దళిత కూలాలు నులకచందయ్యలు అనే వారు కొమ్ముల వారు కూడా ఈ లెక్కలలోనికి ఎక్కలేదు. అంటే ఇదే విధంగా తెలంగాణాలో ఉన్న గోసంగి కులం ప్రభుత్వం లెక్కలలోని వచ్చి ఉండదు. తెలంగాణాలో చిందు కులం చాలా విస్తృతంగా ఉంది. చిందు వారు మాదిగ కులం వారికి కులపురాణాలు పాడి ప్రదర్శించే కులం. వీరు జాంబపురాణాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో జాంబవుడిని గోసంగి అని అంటారు. మొత్తం జాంబపురాణ ప్రదర్శనని గోసంగివేషం అని అంటారు. అంటే చిందుగాయకులనే గోసంగి అని ప్రత్యేకించి జాంబవుని వేషంలో జాంబపురాణాన్ని ప్రదర్శించే వారిని పాడే వారిని గోసంగులు అని అనడం ప్రత్యక్షంగా నేను క్షేత్రపరిశోధనలో విన్న, చూచిన విషయం. థర్ట్సన్ గోసంగి అనేది మాదిగకు పర్యాయ పదం అని మాదిగల ఇల్లెజిటిమేట్ సంతానం అని రాసాడు. వీరు కథాగాయకులు అని స్పష్టంగా చెప్పాడు. చిందువారిలో కొందరిని గోసంగులు అని అనడం అటుంచి గోసంగులు తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఉన్నారని వారు తొలుత మరాఠీ మాట్లాడేవారు ఉన్నారని తర్వాత తెలుగు మాట్లాడే వారు కూడా అక్కడకి వచ్చి ఉన్నారని చెప్పారు, మరొక పరిశోధక మిత్రులు ప్రొఫెసర్ ఎన్నార్ వెంకటేశం. కాబట్టి తెలంగాణాలో గోసంగుల ఉనికి ఉన్నదనే మాట పై ఇంకా చర్చ అవసరం లేదు. కాని ఎండ్లూరి సుధాకర్ భావించినట్లుగా కృష్ణదేవరాయలు గోసంగిని చూచాడని అతనిని ఉద్దేశించే ఈ కథని రాశాడని మాత్రం చెప్పడానికి ఆధారాలు లేవు. సుమారు 50 చోట్ల దాసరి అని రాసి ఒక్కచోట గోసంగి అని రాసిన వాడు గోసంగిని ఉద్దేశించి రాశాడని చెప్పలేము. మిగతా అన్నిచోట్లా తర్వాతి వాఖ్యాతలు గోసంగి పదాన్ని తీసివేసి దాసరి పదాన్ని పెట్టారని చెప్పడమూ వాస్తవంగా అనిపించదు. ఆ వ్యాఖ్యాతలకు దాసరుల మీద ప్రేమకాని గోసంగుల మీద ద్వేషంకాని ఉన్నట్లు అది ఇక్కడ అసలు అవసరం అయినట్లు కూడా చెప్పడానికి వీలులేదు. ఈ పండితులకు అంటరాని వారుగా భావించబడినవారు ఏ పేరుతో ఉన్నా ఒకటే వారంతా వారికి పర్యాయపదాలుగా తోస్తారే కాని మనుషులుగానో వారికి ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నట్లుగానో చెప్పరు. మేడేపల్లి వేంకట రమణాచార్యుల పీఠిక చదివితే అసలు కృష్ణదేవరాయలు తను చూచిన గోసంగివారి మీద ఆధారపడి ఈ కథను రాసినట్లు కనిపించదు. వరాహపురాణాంతర్గత కథే ఆముక్త మాల్యదలోని మాలదాసరికథ అని చాలా విపులంగా వివరించారు. ఇక్కడ ఈ కథను రాయడంలోగల పరమార్థం వేరు. ఒక వ్యక్తి ఎంత హీనకులజుడైనా అతను హరికీర్తన చేస్తే విష్ణుశరణాగతి పొందితే అతను అన్ని కులాల కన్నా గొప్పవాడు అవుతాడు అని పుట్టుకతో బ్రాహ్మణ కులంలో పుట్టినా విష్ణుభక్తుడు కాని వాడు అంటే భాగవతుడు కాని వాడు గొప్పవాడు కాలేడని చెప్పడానికి విష్ణుతత్త్వాన్ని ఈ రకంగా ప్రచారంచేయడానికి ఉద్దేశించిన కథ ఇది. “శ్వపచోఽపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధికః, విష్ణుభక్తి విహీనస్తు ద్విజోఽపి శ్వపచాధమః” అన్నది ఇక్కడి తత్త్వం. ఈ తత్త్వాన్ని ప్రచారం చేయడానికే రామానుజ మతం అంకితమై పని చేసింది. వీర వైష్ణవంలో అన్ని కులాలు సమానవైనవని విష్ణుభక్తుడే అన్నికులాలకన్నా అధికుడని మిగతా వారే శ్వపచులుఅని చెప్పడమే వీరి ఉత్కృష్ట ప్రచారాస్త్రం. వీర శైవంకూడా సరిగ్గా ఇదే చేసింది. శివభక్తుడు కాని వాడే ఛండాలుడు అని శివభక్తుడు అయినవాడే ద్విజునికన్నా అధికుడని దాని ప్రచారంలోని సారం. పాల్కురికి సోమనాథుడు కింది బడుగు కులాలకు సంబంధించిన అందరి కథలను రాయడం వెనుక ఉన్నది ఈ సత్యాన్ని నిరూపించడానికే. కాగా ఇక్కడ కృష్ణదేవరాయల ఉద్దేశం అతను దాసరా లేక గోసంగా అని కాక ఛండాలుడైనా విష్ణుభక్తుడు ఎంత పవిత్రమైనవాడో చెబుతూ తన విష్ణుతత్త్వాన్ని ప్రచారం చేయడమే. ఇందుకే దాసరిని మహాత్మా అని సంబోధించాడు. శైవం వారు వైష్ణవం వారు దళితులను దగ్గరకు తీసుకుని వారికి మతాన్ని బోధించి శివభక్తులు కమ్మని బోధించినా విష్ణుభక్తులు కమ్మని బోధించినా చివరికి ఈనాటి మతప్రచారకులు తమ మతాన్ని గ్రహించడం ద్వారా సామాజిక ఔన్నత్యాన్ని పొందవచ్చని చెప్పినా వీటన్నింటిలోని తత్త్వం ఒకటే మామతాన్ని అంగీకరిస్తే నీవు సామాజికంగా ఉన్నతుడవు అవుతావని చెప్పడమే. నిజానికి ఏ మతంలో చేరిన దళితుడు కూడా తన దళిత కులం ముద్రని పోగొట్టుకోలేకపోయాడు. మోసపోయాడు. వ్యతిక్రమంలో ఆ మతాలలోనే కులాలు వచ్చాయి.
కాగా దాసరి అంటేనే వైష్ణవుడు అని, జంగం అంటే శైవుడు అని రూఢిగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి ఉంది. కానీ చిందులలో ఉన్న గోసంగి వేషధారులు కాని చిందులు కాని వైష్ణవులు కారు చిందువారు ప్రధానంగా శైవులు మాదిగలు కూడా ప్రధానంగా శైవులే. కాని దాసరులలో మాదిగదాసరులు మాలదాసరులు వేరేవేరే ఉన్నట్లు నూటయైభై సంవత్సరాలక్రితం నుండి వచ్చిన సర్వేలవల్ల తెలుస్తుంది. అంటే మాదిగలు వారి ఉపకులాలలో కొందరు వైష్ణవ మతానుయాయులుగా ఉన్నట్లు తెలుస్తుంది. కాని కృష్ణరాయలు అన్నిచోట్లా దాసరి అనే రాశాడు కాని మాలదాసరి అని రాయలేదు. అతని అవసరానికి కావ్యాంతర్గతమైన వ్యూహానికి ఈ విచక్షణ అవసరం లేదని ఇక్కడ స్పష్టం. గోసంగి అనే మాటను యథాలాపంగా వాడిన పర్యాయపదం అని గట్టిగా చెప్పలేకపోయినా గోసంగిని ఉద్దేశించి ఈ కథను రాయలేదని మాత్రం ఇక్కడ బాగానే తెలియవస్తూ ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో అంటరానితనం అనే సామాజిక దురన్యాయానికి గురైన కులాలు బయటి ప్రపంచానికి, అంటే గ్రామీణ నేపథ్యం తెలియని నగరజీవన మేధావులకు తెలిసిన కులాలు రెండు మాదిగ మాల. కాని దళిత కులాలు వివిధ రకాల వృత్తులలో ఉన్నవారు అనేక కులాలుగా విడిపోయి ఉన్నారు. స్వతంత్ర అస్తిత్వం కలిగిన కులాలను మన సర్కారు లెక్కల ప్రకారం ఉపకులాలు అని అన్నారు. భారత ప్రభుత్వం సర్వే చేయించి అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్డు కులాల జాబితా ప్రకారం, 1956లో సవరించబడి తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది అధికారికంగా ప్రకటించిన జాబితా ప్రకారం. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉన్న షెడ్యూల్డు కులాలు నాలుగు. రాయలసీమ సర్కారు జిల్లాలలోనే ప్రత్యేకించి ఉన్న కులాలు 28. అలాగే తెలంగాణా జిల్లాలలో ఉన్న కులాలు 28 ఉన్నాయి. మొత్తం 60. గోసంగి అనే కులం సర్కారు ప్రాంతంలో ఉన్నట్టుగానే ఉంది. కాని తెలంగాణా జిల్లాలలో ఉన్న ఈ కులాలలో గోసంగి అనే కులం లేదు. కానీ ఈ సర్వే సమగ్రం అని చెప్పడానికి వీలు లేదు. కారణం తెలంగాణాలో ఉండే నులక చందయ్యలు అనే కులం, కొమ్ముల వారు అనే కులం ఇందులో చేరలేదు. అలాగే సంగడి వారు అనే మాదిగల ఉపకులం కూడా ఇందులో చేరలేదు. ఇందువల్ల ఈ జాబితా సమగ్రం కాదని తెలుస్తుంది. దీన్నిబట్టి గోసంగి వారు అనేవారు తెలంగాణాలో లేరు అని చెప్పడానికి వీలు లేదు సర్వే చేసిన వారు దీన్ని గమనించి ఉండకపోవచ్చు. అంతే కాదు. చిందు మాదిగలు వేసే జాంబపురాణకథ నాటకంలో బ్రాహ్మణుడు, జాంబవుడు మాత్రమే ఉంటారు. ఇందులో జాంబవుడి పాత్రను గోసంగివేషం అని అంటారు. గోసంగి అని అంటే జాంబవుడు అనే అర్థం. దీనికి గోసంగి పురాణం అనే పేరు కూడా ఉంది. కాబట్టి గోసంగులు అందరూ వైష్ణవులు అని చెప్పడానికి వీలు లేదు. తెలంగాణాలో ఉన్న షెడ్యూల్డు కులాల గురించి 1920 నాటికే నిజాము సర్కారు సర్వే చేయించింది. ఇందులో మాదిగల ఉపకులాలు 25 ఉంటే మాలల ఉపకులాలు 37 ఉన్నాయి. కాని ఇందులో కూడా కొన్ని పేర్లు లేవు. ఇందులో కూడా గోసంగి అనే కులం పేరు లేదు. నిజాం సర్వే సిరాజుల్ హసన్ పుస్తకంలో వెలువడింది. ఇది కూడా సమగ్రం అని చెప్పడానికి వీలు లేదు. కాని ఇందులో మాదిగ దాసరులు, మాల దాసరులు వేరు వేరుగా ఉండడాన్ని గమనించవచ్చు.
ఎండ్లూరి సుధాకర్ గోసంగినే ఉద్దేశించి ఈ కావ్యాన్ని రచించాడు. స్వతంత్రమైన అస్తిత్వం ఉన్న పైన చెప్పిన ఇన్ని కులాలను ఒక గాట కట్టి చూడవద్దని విడివిడిగానే వారి అస్తిత్వాన్ని గ్రహించమని అతని వాదన. ఈ భావనతో ఆరంభమైన కావ్యమైనా ఇందులో ఉన్న తాత్త్వికత మాత్రం ఒక దళిత గాయమే. శతాబ్దాలుగా ఈ గాయం మానకుండా వస్తూ ఉన్నా దీనికింకా సరికొత్త ఇన్పెక్షన్లు వస్తున్నాయేకాని గాయం మానటం లేదు అనే తత్త్వాన్నేఇక్కడ సుధాకర్ చెప్పదలచుకున్నాడు. కృష్ణదేవరాయలు దళితగాయకుని గురించి ఇంత గొప్పగా కథ రాసినా అతని ఆస్థానంలో దళిత కవికి స్థానం లభించలేదని బాధపడతాడు సుధాకర్. ఇలాంటి బాధని జాషువా గారు కూడా పడ్డారని గుర్తుకు చేస్తాడు సుధాకర్. “కృష్ణరాయా/ కీర్తికాయా/ నీభువన విజయంలో/ నా కవనం కనబడుతుందా/ అష్టాదశ వర్ణనల్లో అస్పృశ్య వర్ణం నిషిద్ధం/ నీ ప్రబంధాలలో/ నా జాతి అందం ప్రతిబింబిస్తుందా/ నీ భువన విజయంలో/ నేను కాలు మోపి ఉంటే/ అష్టదిగ్గజాలేం కర్మ వేల దిగ్గజాల నీలి పాదాలు/ గండపెండేరాలతో ఘల్లు మనేవి/. నీ సైన్యంలో మేముంటే/ నీకీర్తి పతాక హిమాలయాన్ని ముద్దాడేది” అంటాడు సుధాకర్. ఒక దళిత కవి ప్రతిభను గుర్తించలేదు రాయలు అని భావిస్తూ వారికి చోటివ్వలేదు అని అనుకుంటూ కూడా మాదిగ కులం ఒకటే కాక ఇతర చిందు, పంబల, డప్పువారు, డక్కలి కిన్నెర మాతంగి మొదలైన వారి కళాప్రతిభను అత్యం ఆర్ద్రంగా గుండెకు తగిలేలా ఈ కావ్యంలో రాస్తాడు సుధాకర్. ఎండ్లూరి ఇక్కడే ఒక దళిత కవిగా ఇతర దళిత కులాల అస్తిత్వాన్ని గురించి ప్రస్తావించి కవిత రాయడంలో కృతకృత్యుడయ్యాడు. లోతుగా చూస్తే కృష్ణరాయల గురించి చెప్పడం ఇక్కడొక మిష మాత్రమే. అతను తాత్త్వికంగా ఇక్కడ చెప్పదలచుకుంది శతాబ్దాలుగా మానని దళిత గాయం ఎంత బాగా పాడుతుందని విభిన్న కుల అస్తిత్వాలతో ఉన్న ఈ దళిత గాయాలలో ఎంత కళ ఉందో చెప్పడమే ఇతని లక్ష్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. గోసంగి కథ వినడానికి ఆర్ద్రత కావాలని చెప్పిన సుధాకర్. గోసంగి దీర్ఘకవితలో అడుగడుగునా ఈ ఆర్ద్రతని చిప్పిల జేయడంలో మంచి కౌశలాన్ని చూపాడు. ఆముక్త మాల్యద కథలో దాసరి బ్రహ్మరాక్షసునికి భయపడలేదు అతనికి ఎదురునిలిచి విల్లు ఎక్కుపెడతాడు. చివరికి అతని బలానికి లొంగినా ప్రతిఘటించే నైజం, శక్తిని చూపుతాడు. నిజాయితీగా తిరిగి రాక్షసుని దగ్గరికి వస్తాడు. దీన్ని ఆధారం చేసుకొని సుధాకర్ ఇలా రాస్తాడు. “బ్రహ్మరాక్షసికి నేను భయపడలేదు కాని కులరాక్షసి దెబ్బకు కుంగిపోయాను” అంటాడు. ఈ పాదాలు చదివే టప్పుడు పైకథ గుర్తుంటే వీటి స్వారస్యం తెలుస్తుంది. కృష్ణరాయలను ఒకందుకు మెచ్చిన సుధాకర్ అతన్ని ఎలా అంటాడో ఇక్కడ గమనించవచ్చు. “కృష్ణరాయా/ నేన్నిప్పుడు ప్రశ్నవేయ/ సముచితమో కాదోగాని/ నీ కీర్తి కిరీటంలో కలికి తురాయి/ అంటరానిదేనని గుర్తించలేకపోయాను/. జోహార్ మూరురాయర గండ/ నీవేపే చూస్తున్నది/ నీవు జయింలేకపోయిన అంటరాని కొండ” అంటాడు. కావ్యం చివర్లో “ఓ వైష్ణవ చక్రవర్తీ/ ఇదీ పదహారో శతాబ్దపు అస్పృశ్యుల దుస్థితి/ సర్వం విష్ణుమయం జగత్ కాదు/ సర్వం విషమయం జగత్/” అని కావ్యాన్ని ముగిస్తాడు.
నా విష్ణుః పృథివీపతిః అని అన్నట్లు విష్ణువే రాజు అవుతాడు అని కదా చెప్పేది. ఇక రాజులు ఉన్నది చాతుర్వర్ణ వ్యవస్థని కాపాడడం కోసమే. కృష్ణరాయల కొలువులోని మహామహాకవులు అందరూ అతన్ని వర్ణసంకరం జరగకుండా మనుధర్మాన్ని పాలించేవాడని లేదా వర్ణాశ్రమ ధర్మాలని రక్షించేవాడని పొగడినవారే కదా. ఇలా చేసాడని కాదు ఈ వర్గపు కవులు పొగిడేది. నిజానికది చేసినదానికి పొగడడం కాదు. ఇలా చేయమని రాజుకు చెప్పడమే. వర్ణాశ్రమధర్మాన్ని పాలించే కృష్ణరాయడు అంటరానితనాన్ని జయించలేకపోయాడు అని సుధాకర్ రాయడం చారిత్రక వాస్తవాన్ని గ్రహించలేకపోవడం కాదు. దాని మిషతో ఆనాటి అస్పృశ్యతా జాడ్యాన్ని గురించి రాయడమే. రాజులు దళితులను గౌరవించలేదని అనడం గొంగడిలో ఉన్న అన్నంలో వెంట్రుకలు వచ్చాయని ఆశ్చర్యపోవడమే.
ఈ నాడు నిలిచి ఉన్న అంటరానితనం అనే సాంఘిక విషసమస్యని చారిత్రకంగా చూచి తర్కించి రాయడానికి దాసరి కథ లేదా గోసంగి కథ సుధాకర్ కి మంచి భూమికగా ఉపయోగపడింది. అంతే కాదు దళిత కులాలో అనేక సంఖ్యలుగా ఉన్న స్వతంత్ర అస్తిత్వం కలిగిన కులాల గురించి తనలోని ఆర్ద్రతని తెలియపరచడానికి ఈ కావ్యం సార్థకమైంది. ఒక దళిత వస్తువుపైన దీర్ఘకవిత రావడానికి కూడా ఇది ఆస్కారంగా నిలిచింది. గోసంగి నిస్సందేహంగా కావ్యస్థితిని పొందింది. కావ్యానందాన్ని కలిగించే ఎంత పొడుగు కవితనైనా కావ్యం అనవచ్చుకదా. ఇక్కడ నేను ఇంకా కావ్యలక్షణ చర్చ చేసే సందర్భం కాదు. ఒకటి చెప్పాలి. గోసంగి ఈనాటి దళిత కావ్యం, జ్వలిత కావ్యం. ఇది లోతైన భావుకతకు పండిన పంటపొలం. సుధాకర్ లోని ఆర్ద్రత ప్రతి తావులోను చిప్పిలుతుంది. ఇంత లోతైన భావుకతా సంపద ఉండి కూడా సుధాకర్ కు భాషలో చాదస్తం పోలేదు. వచనకవితా రచనలో ఇతనిని ఇంకా పాతవాసనలు వదలలేదు. సుధాకర్ కు ఆది ప్రాసలమీద అంత్య ప్రాసల మీద మోజు పోలేదు. గోసంగిలో ఇవన్నీ రంగు రంగులుగా కనిపిస్తాయి. ఇతను చెప్పదలచుకున్న రంగుకు ఇవి అవసరం లేదు. ఇతని ఉపన్యాసాలలోను ఈ ధోరణి కనిపిస్తుంది. వరుసగా ప్రాసలు వేసి మాట్లాడడం. వీటి మీద మోజు పరిణతమైన వచన కవితకు వల్లమాలిన సొమ్ముల బరువే. ఆధునికతకు దూరమైన ఏడువారాల నగలే.
ఏమైనా గోసంగి కావ్యం ఒక మంచి కావ్యానుభూతిని కలిగించడమే కాదు శతాబ్దాలుగా మానని దళిత గాయాన్ని దాని పచ్చిదనాన్ని చూపుతుంది. ఆ దళిత గాయానికి ఒక ఆకారమే గోసంగి.
పులికొండ సుబ్బాచారి.

పైట ఒక్కటే – దళిత కులీన దృక్పథాలు రెండు – పైటను తగలెయ్యడం పెట్టుబడిదారీ విష సంస్కృతే

ఆధునిక వచన కవిత్వంలో ఒకే వస్తువును తీసుకొనిఇద్దరు స్త్రీవాద కవయిత్రులు ప్రత్యభిముఖంగా కవిత రాసిన అరుదైన ఘట్టం ఒకటుంది. ఇద్దరూమంచి ప్రతిభావంతులైన కవయిత్రులు స్త్రీవాద దృక్పథంతో కవిత రాయడంలో బాగా ఆరితేరినకవయిత్రులు. ఇద్దరూ పరస్పర భిన్నమైన నేపథ్యాలనుండి వచ్చారు. ఇద్దరూ రెండు భిన్నమైనజీవన దృక్పథాలతో ఈ కవితల్ని రాశారు. ఈరెండు కవితల్ని క్షోదక్షమంగా పరిశీలిస్తే కవయిత్రుల సామాజిక నేపథ్యాలలో ఉన్నభిన్నత్వం వారి కవితలో ఎలా ప్రతిబింబిస్తుందో బాగా అవగతం అవుతుంది.

ఒకరు జయప్రభ, ఈమె రాసిన కవిత “పైటని తగలెయ్యాలి” మరొక కవయిత్రి జూపాక సుభద్ర ఈమె రాసిన కవిత “కొంగు నా బొచ్చ మీద కావలుండే బొంతపేగ్గాదు” రెండు కవితలు పైటచెంగును ఆధారంగా ఆసరాగా చేసుకొని రాసినవే. అయితే ఈ కవితలు ఈ కవయిత్రులు ఇద్దరూయాదృచ్ఛికంగా ఒకరికొకరు అనుకోకుండా రాసిన కవితలు కావు. జయప్రభ తన కవితను మే 31,1988లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో తొలిసారి ప్రకటించింది. తర్వాత ఈ కవిత వేరే కవితసంకలనాలలో అచ్చయింది. ఈ కవిత జయప్రభకు మంచి పేరు తెచ్చింది. జయప్రభ 1980 నుండేకవితలు రాస్తున్నా ఆమెకు 1984 ప్రాంతంనుండి మంచి పేరు వచ్చింది. స్త్రీవాదరచయిత్రిగా ఒక ముద్రను వేసుకుంటూన్న స్థితిలో పైటని తగలెయ్యాలి అనేకవిత ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. ఈ కవిత ఆమె స్త్రీవాద కవయిత్రి అనేముద్రను సుస్థాపితం చేసింది. ఈ కవితపైన ఆరోజుల్లో మంచి వాడి వేడి చర్చ జరిగింది.చాలామందిని బాగా ఆలోచింపజేసిన ఆనాటి కవితల్లో ఒకటిగా నిలిచింది. ఇక జూపాక సుభద్రతన కవిత “కొంగు నా బొచ్చ మీద కావలుండే బొంత పేగ్గాదు” నుమే 7, 2007ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే రాసింది. ఆతర్వాత ఈ రెండు కవితలు వారివారి,వేరువేరు సంకలనాలలో కూడా అచ్చయినాయి. సుభద్ర స్త్రీవాద కవయిత్రి అయినా ఈ ముద్రకంటేదళిత కవయిత్రి అనే ముద్రని బాగా పొందింది. స్త్రీవాద కవనంలో కులీన స్త్రీవాదులకన్నా దళిత స్త్రీవాదం బహుజన స్త్రీ వాదం చాలా భిన్నమైనవని వీరి సామాజికఅస్తిత్వాలు చాలా భిన్నమైనవని సుభద్ర చాలా గట్టిగా వాదిస్తుంది. ఒక బలమైన వాదాన్నిముందుకు తెస్తూ తనకంటూ స్త్రీవాద కవయిత్రులలోను దళిత కవయిత్రులలోను ఒక ప్రత్యేకస్థానాన్ని పొందింది. స్త్రీవాద కవయిత్రుల నందరినీ ఒక గాటకట్టి చూడడం సరైన దృక్పథంకాదన్న వాదన చాలామందిలో ఉన్నా సుభద్ర తన కవితల ద్వారా ఈ వాదాన్ని సరైన వాదంగా రుజువుచేసింది. ఇలా రుజువు చేసిందని చెప్పడానికి ఈ పైట పైన ఇద్దరుకవయిత్రుల కవితల్నే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రెండు సామాజిక సిద్ధాంత భూమికలనుండి ఈకవితలు వస్తున్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైన చెప్పుకున్నట్లుయాదృచ్ఛికంగా కాక సుభద్ర తన కవితను జయప్రభ పైటని తగలెయ్యాలి అనే కవితకుతన కవితను కావాలని ప్రతిముఖంగా రాసినట్లు స్పష్టంగా తెలుసుకోవచ్చు.అందుకే ఈ రెండింటిని ప్రత్యేకంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఈ సిద్ధాంత విషయాల్నిసామాజిక నేపథ్యాలని పరిశీలించడానికి ఈ రెండు కవితల్ని విపులంగా స్పష్టంగాపరిశీలించవచ్చు.

“పైట కొంగునుచూస్తే/ నాకెందుకో పాతివ్రత్యం గుర్తుకొస్తుంది/భుజాలనుంచి కిందికివేలాడే గుదిబండలా/ అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది”పైట చెంగును పాతివ్రత్యానికి చిహ్నంగా ఒక సామాజిక భావానికి చిహ్నంగా అది స్వేచ్ఛనుహరించే గుదిబండలా భావించింది జయప్రభ అది తనను వంగదీయాలని ప్రయత్నిస్తూ తనకు అలవాటులేని సిగ్గును మప్పుతుంది తనచుట్టూ ఏదో కంగారుని పిట్టలా తిప్పుతుంది అని రాసింది.’తనను మనిషిని అనే భావాన్ని మరిపిపంజేసి తనుఆడదానివంటూ హిప్నటైజ్ చేస్తుంది’ అని అంటుంది. ‘దాని ముందు తానుఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నట్లు ఉంటుందని పైట ఊబిలా తనను గుంజేస్తుంటుందని చెబుతుంది’ జయప్రభ. ఇంత కన్నా స్పష్టంగా కవిత్వపు పొర కాని సంకేతాత్మకపొర కాని లేకుండా స్పష్టంగా ”నన్ను అబలను చేసిన పితృస్వామ్యపు అదృశ్య హస్తంపైట” అని ”దోపిడీ సంస్కృతి నావ్యక్తిత్వాన్ని శవంగా చేసి దానిపైన కప్పిన తెల్లదుప్పటి పైట” అని ”నేను నడిచే శవంగా కాకుండా ఉండాలంటే ముందుగాపైటని తగలెయ్యాలి” అని చాలా విస్పష్టంగా చెబుతుంది జయప్రభ. కానిసుభద్ర పైటను మరొక దృక్కోణంలో చూచింది. పల్లీయ జీవితంలో ముఖ్యంగా ఆరుగాలం కాయకష్టంచేసుకునే స్త్రీ జీవితంలో దైనందిన కార్యక్రమాలలో పైట ఎన్నిరకాలుగా స్త్రీకిఉపయోగపడతుందో చాలా వివరమైన జీవన చిత్రాన్ని చూపుతుంది. అసలు కవిత పేరునే జయప్రభకవితకు ప్రతిముఖంగా పెట్టింది. జయప్రభ పైట నాకు కావలి కాస్తూ నా పాతివ్రత్యాన్నికాపాడే కంచెలా కావలుంటూ పితృస్వామ్యవ్యవస్థని కాపాడుతూ ఉంది అని అంటే సుభద్ర ‘కొంగు నా బొచ్చ మీదకావలుండే బొంత పేగ్గాదు’ అని మొదలు పెడుతుంది. వక్షస్థలాన్ని లేదాఛాతీని తెలంగాణా పల్లె భాషలో బొచ్చ అని ఎదురు బొచ్చ అని ఎదుర్రొమ్ము అని అంటారు.పేగు అనే మాటను గుడ్డకి సమానార్థకంగా వాడతారు. గుడ్డపేగు, బొంతపేగు అని వ్యవహారాలుఉన్నాయి. తెలంగాణా పల్లీయ జీవితం గాఢంగా పరిచయం ఉన్నవారికి ఇవి బాగా తెలిసినపదాలే. ఈ పదాలు వాడి కావలుండే బొంత పేగ్గాదు అని అంటుంది. జయప్రభ ఇది నాకు కాపలాకాస్తుంది అని అంటే సుభద్ర ఇది కాపలా కాదు దానికి భిన్నమైన జీవన సాధనం అని వివరంగావర్ణిస్తుంది. ‘కొంగు నా ఆకలిని ముడేసుకొని/ నాకడుపు కర్సుకొనికట్టమీని మైసమ్మోలే కావలి బంటది (అంటే రక్షిస్తుందని)/ కూలినాలికి నేను సెమటకాల్వనైతే/ పిల్లగాలై అద్దుకుంటది/ కాయగడ్డలకు గాసంగింజలకు/ కోమటి దినుసులకు/సుక్కల్ని పొదుపుకున్న సందమామోలె/ నా నెత్తిన మూటై మెరుస్తది/ సేండ్ల సెల్కల్ల అల్సి పుల్లసీలితే పక్కబట్టైపురసతిస్తది’. ఇక్కడ సుభద్ర పల్లీయ జీవితంలో కష్టం చేసేస్త్రీకి కొంగు ఎన్ని రకాలు గా ఉపయెగిస్తుందో చెబుతూ, మైసమ్మలాగ అకలి కడుపుకుకావలి పండటం, కష్టం చిందే చెమటను తుడవడానికి పిల్లగాలికావడం, సరుకులన్నీ కోమటికొట్లో కొంటే మూట అవుతుందని చేలల్లో చెలకల్లో కష్టించి అలసి పోయి పడుకుంటేపక్కబట్ట కావడాన్ని అద్భుతంగా చెబుతుంది. అల్సి సొల్సి పుల్లసీలితే పక్కబట్టైపురసతిస్తది అని చెప్పడం ఆ పదాల వినియోగం పల్లీయ జీవితాన్ని కంఠదఘ్నంగా అనుభవిస్తేతప్ప రాయలేరు. ఒళ్ళు పుల్లసీలడం అనండం మంచి తెలుగు అభివ్యక్తి పురసత్ ఇవ్వడం అనేదితెలంగాణా ఉర్దూ పదం తో కూడిన అభివ్యక్తి. ఇంకా చాలా జీవన చిత్రాల్ని సుభద్రసమర్థవంతంగా కళ్ళ ముందుంచుతుంది. తనకి ‘దుఃఖం కంటికిమంటికి ఏకధారైనప్పుడు కన్నతల్లోలె దగ్గరికి దీసి అదుముకుంటది నా మట్టి కొంగు పేల్క’ అంటుంది. ఒకనెగెటివ్ దృశ్యాన్ని కూడా ‘పెనిమిటికి కోపమెస్తే సెతిలో ఎన్నముద్దోలెదొరికిపోతదని’ పెనిమిటి కోపానికి కొత్త రూపాన్ని చెబుతుంది.బలిమికైనా జులుము కైనా సెరబడేది ముందు నాకొంగు పేగే అని ఆ దృశ్యాన్నీ చూపుతుంది.ఇంకొక అద్భుత దృశ్యాన్ని చూపుతుంది. ఇలా ‘నా సెంపల్నిముద్దాడుతూ/ సలి పులుల్నించి, ఎండ పొడసూపుల్నించి/, వడగాలుల సుడి దెబ్బల్నుంచి/వాన సినుకుల సిత్కతనం నుంచి/ నా మొకం పొద్దు పొడుపుకు నా తలనీలాలకు తంగేడు పూలగొడుగు పడ్తది’. ఎండనక వాననక నిత్యం పనిచేసే వారికి పైట చెంగుఎన్నివిధాల ఉపయోగపడుతుందో ఇక్కడ కమనీయంగా చెప్పడం చివరి మెరుపు ‘తంగేడు పూల గొడుగుపడ్తది’ అని అనటం. చెట్టు నీడ అవుతుందని వెచ్చనిచలిమంటై భుజాల్ని కప్పుతుందని అంటుంది. ‘పొయి మీద గిన్నెలకుమసి బంత పేగై సెయి గాల్చుకుంటుంది’ అని చెబుతూమసిబట్టై కొంగు అదే చెయి కాల్చుకుంటుంది అని చెప్పడం సుభద్ర కున్న అద్భుత కవితాప్రతిభ. ఇంకా ఏడ్చే పసి బిడ్డలకు పొత్తిగుడ్డై హత్తుకుంటందని, ముక్కుతూముల్నితుడుస్తుందని, నెలబట్టమాసిన మోదుగు పూ రంగుకు తడ్క సాటోలె అడ్డుపడ్తది అని మరొకదృశ్యాన్ని చూపుతుంది సుభద్ర. నాట్లు, కోతలప్పుడు, అన్నిరకాల పనులప్పుడు కొంగు ఏం చేస్తుందో చెబుతుంది. ‘నా బతుకు తొవ్వలతోడైన నా కొంగు పేల్క యెదమీద ఒదిగే అదునేది సాకి బండోలె సాకిరి చేసే నా సెమట కొంగుబొచ్చె మీద కావలుండే బొంత పేగ్గాదు.గుండెల మీద చేరే గుది బండకాదు బజారు కీడ్సి ఎట్లా బద్నాం జేద్దు అగ్గివెట్టినేనెక్కడ ఆగమైదు’ అని స్త్రీజాతినే కాదు మగజాతినీ సంప్రశ్నంగా అడుగుతుంది. పైట కావలుండేది కాదనిఇది గుండేల మీద చేరే గుది బండ కాదనిగట్టిగా చెప్పడం జయప్రభ కవితని స్పష్టంగా కౌంటర్ చేయడమే.

జయప్రభ కవిత పైటనితగలెయ్యాలి లో అర్బన్ ఎలీట్ భావాలు హైఫై సంస్కృతికి చెందిన నగరజీవన స్త్రీభావాలు కనిపిస్తాయి. పైట పాతివ్రత్యానికికాపలా గా గుదిబండలాగా ఉందని చెప్పడం పితృస్వామ్య సంస్కృతికి పెట్టుబడి దారీ దోపిడీసంస్కృతికి పైట చిహ్నంగా ఉంది అని జయప్రభ చెబితే, సుభద్ర పల్లీయ జీవితంలో ఆరుగాలంకష్టపడి పని చేసే స్త్రీకి జీవితంలోని ఎన్నోఘట్టాలలో పైట చెంగు సహచరిగా సైదోడుగాకైదోడుగా ఉంటుంది అని జీవన దృశ్యాల్ని చూపుతూ రుజువు చేస్తూ చెబుతుంది. జయప్రభపైటని తగలెయ్యాలి అని అంటే సుభద్ర ఇది నాకు తంగేడు పూల గొడుగు అని, దీన్ని ఎట్లాబద్నాం చేస్తా అని, దీనికి అగ్గివెట్టి నేనెక్కడ ఆగమైతా అని బాధపడుతుంది. పైటకున్ననిత్యజీవితపు శ్రమైక జీవితానికి చెందిన ఈ విలువల్ని జయప్రభ చూడలేక పోయింది. పైటఅనేది భారతీయ స్త్రీ తన వక్షస్థలాన్ని అంటే తన స్త్రీత్వపు చిహ్నాలపైన చెడు చూపుపడకుండా ఉండే సాధనంగా భావిస్తుంది. వక్షోజాలను వంపు సొంపులను ఆరబోయకుండా ఉండడంసామాజిక జీవన సరళ గమనానికి అవసరం అని స్త్రీ భావించే దశ ఇంకా గ్రామీణ జీవనంలోఉంది. కాని వక్షసంపదని వంపుసొంపులని ఆరబోసి తన శరీర సౌష్టవాన్ని చూపడం అనేది ఒకవృత్తికి అవసరంగా ఉంది. నగరజీవన స్త్రీకి పెట్టుబడి దారీ విషసంస్కృతికి బలై పోయేస్త్రీ జీవితానికి అది తప్పనిసరి అవసరం. ఇలాంటి స్త్రీకి పైట చెంగు గుదిబండ నిజంగాఅవుతుంది. స్త్రీ తన దేహభాషని చూపడం ద్వారానే డబ్బు సంపాదించే స్థితి రావడం నిజంగాపెట్టుబడి దారీ సంస్కృతిలో స్త్రీ తన శరీరాన్ని ధ్వంసం చేసుకునే విష సంస్కృతే. ఒకకొత్త కారును మార్కెట్ లోనికి ప్రవేశ పెట్టేటప్పుడు ఒక స్త్రీ మోడల్ గా కారు పక్కన నిలబడి అరికాలు వద్ద నుండితొడల పైభాగం దాకాను వక్షస్థలంలో సగానికి ఎక్కువ గాను చూపడం, దీన్ని తనకు వృత్తిగాస్వీకరించడం, మోడల్ గా ఉండి తన దేహ భాషని తను సంపాదించుకునే పెట్టబడిగా వాడుకోవడంతనను తను ఒక కమ్మోడిటీగా కమ్మోడిఫై చేసుకోవడం అన్నది అర్బన్ స్త్రీ పెట్టబడి దారీవిష సంస్కృతిలో ఎలా తాను ఛిద్రమౌతూ కమ్మోడిటీగా మారుతుందో చెప్పడానికి పూర్తిప్రతీక. ఇది దోపిడీ సంస్కృతి. ఇలాంటి దోపిడీ సంస్కృతి లో పైట నిజంగా గుదిబండఅవుతుంది ఎందుకంటే అది అడ్డం ఉంటే సినిమా వ్యాపారం కాని మోడల్ వ్యాపారం కానిపెట్టుబడి దారీ సంస్కృతి కాని పెరగవు లాభాలు గడించవు. కాని జయప్రభ ‘దోపిడీ సంస్కృతి నావ్యక్తిత్వాన్ని శవంగా చేసి దానిపైన కప్పిన తెల్లదుప్పటి పైట’ అని వర్ణించడంపెట్టుబడి దారీ సంస్కృతిలో స్త్రీకి స్త్రీ శరీరానికి జరిగే నిజమైన అన్యాయం ఏమిటో గమనించ లేకపోవడమే.ఇది సామాజిక యదార్థాన్ని గ్రహించలేని వైఫల్యం.

కాని సుభద్ర పైటపల్లీయ జీవితంలో స్త్రీకి ఎంత స్నేహితుడుగా అన్ని జీవన అవసరాలకు ఉపయోగిస్తుందోచాలా ప్రతిభావంతంగా చెప్పగలిగింది. దీనికి కారణం సుభద్ర ఈ శ్రామిక జీవితాన్ని తానుస్వయంగా అనుభవించి ఉండడమే. తాను ఈ పల్లీయ జీవితాన్ని కంఠదఘ్నంగా అనుభవించి ఉండడమే.జయప్రభ కవిత హైపై నాగరికతకు చెందిన అర్బన్ ఎలీట్ వర్గానికి చెందిన స్త్రీ వాదాన్నిచెబితే సుభద్ర కవిత అతి కింది స్థాయిలోనిపల్లీయ జీవనంలో స్త్రీ ఆరుగాలం కష్టించే శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపుతుంది.రెండు కవితల్లోని భాష కూడా దీనికి అనుగుణంగానే సాగింది. జయప్రభ కవితలోని భాష ఆధునికప్రామాణిక వ్యవహార భాష లో ఉంటే సుభద్ర కవితలోని భాష నూటికి నూరుపాళ్లు తెలంగాణాపల్లీయ జీవనాన్ని ప్రతిబింబించే సహజమైన భాష. ఆభాషలోనే కొత్త కొత్త సమాసాలతోరమ్యమైన దృశ్యాలను చూపుతుంది జూపాక సుభద్ర. తెలంగాణా పల్లీయభాషలోని అందాలన్నీసుభద్ర కవిత్వంలో ఉన్నాయి. ఈ భాషతో గాఢంగా పరిచయం లేని వారికి సుభద్ర కవితలు అర్థంకావు.

ఒక్క పైట కొంగును గురించేఇద్దరు కవయిత్రులు ఇంత భిన్నంగా వైరుద్ధ్యభరితమైన దృశ్యాలను చూపడానికి వీరిద్దరిసామాజిక నేపథ్యాలే కారణం. సుభద్ర తన సామాజిక నేపథ్యాన్ని స్పష్టంగా కుండబద్దలుకొట్టినట్టు తన పుస్తకం అయ్యయ్యో దమ్మక్కా లో చెప్పింది. సుభద్ర కాయకష్టంజేసే గ్రామీణ మాదిగ కుటుంబంలో పుట్టింది. ఇక జయప్రభ సామాజిక నేపథ్యం ఆమె వివరంగాచెప్పకపోయినా అర్బన్ ఎలీట్ అంటే కులీన సంస్కృతి నుండే వచ్చింది. ఈ వైరుద్ధ్యంవీరిద్దరి కవితల్లో స్పష్టంగా కనిపించింది. స్త్రీవాద కవితలో అర్బన్ ఎలీట్ అంటేనగరజీవన ఆధునిక మహిళ కులీన మహిళ కవితకు గ్రామీణ జీవితానికి చెందిన దళిత బహుజనశ్రామిక జీవనానికి చెందిన మహిళ కవితకు తేడా ఉంటుందని వీరిద్దరిని ఒక గాటకట్టవద్దని చెప్పే సుభద్ర సిద్ధాంతానికి ప్రతినిధిత్వం వహించేలా సుభద్ర కవిత “కొంగునా బొచ్చ మీద కావలుండే బొంత పేగ్గాదు” అనేది నిలుస్తుంది. స్త్రీవాదకవిత్వంలో ఉన్న వర్గ భేదాలకు అస్తిత్వపు పోకడలకు ఈ రెండు కవితల్ని మచ్చులు గాచెప్పవచ్చు.

ప్రొఫెసర్ పులికొండసుబ్బాచారి.

psubbachary@gmai.com

తెలుగులో జాలసాహిత్యం

తెలుగులో జాలసాహిత్యం
జాలము అంటే వల అనే అర్థమే కాకుండా మాయ అని జాలము సేయడం అంటే మాయ చేయడం అని అర్థాలు ఉన్నాయి. ఏక్షణాన ఇంటర్నెట్ ను అంతర్జాలం అని అనువాదం చేయడం అయిందో కాని నిజంగా అంతర్జాలం మాయలాగా ఉంది. అంటే దీని ప్రగతి నమ్మలేనంతగా ఉంది అని ఇక్కడి నాభావం. కొంత కాలం క్రితం నెట్ లో తెలుగు కనపడడం సాంకేతిక అసాధ్యంగా ఉండేది. దీనికి వేరే వేరే రకాల ఫాంట్లు వగైరా గొడవ చాలా ఉండేది. కాని యూనికోడ్ ఫాంట్ లు వచ్చిన తర్వాత తెలుగు వ్యాప్తి బాగా పెరిగింది. విండోస్ లో తెలుగును ఒక మాధ్యమ భాషగా స్థాపించిన తర్వాత గౌతమి ఫాంట్ యూనివర్సల్ ఫాంట్ అయింది. దీనితో ఎక్కడినుండి ఎక్కడికి మెయిల్ పంపినా కూడా తెలుగులో చదవడానికి వీలు అవుతూ ఉంది. తెలుగు వాడుక జాలికలో పెరగడం ఇటీవలి పరిణామమే. తెలుగు వారు అందరూ చాలా ఆనందించదగిన విషయం. ఎక్కడో అమెరికాలో కూర్చున్న అఫ్సర్ తన కవిత్వాన్ని ఎప్పటికప్పుడు తన బ్లాగులో అందరికీ అందించగలుగుతున్నా. తెలుగు పత్రికలు ప్రపంచంలోని అన్ని మూలలో ఉన్న తెలుగువారికి కనువిందు చేస్తున్నా. దీనికంతటికీ కారణం జాలంలో తెలుగుకు చోటు దొరకడమే. తెలుగు సాహిత్యం మౌఖిక మాధ్యమం నుండి, లిఖిత మాధ్యమం వైపు మళ్ళి ఎన్నో శతాబ్దాలు అయింది. కాని జాలం అనేది కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ మాధ్యమం. దీన్నే విద్యున్మాధ్యమం అని అందాం. ఇది లిఖితమే అయినా ఇది పుస్తక రూపంలో చదవుకునేది కాదు. పైగా ఇది జాలంలోనే పుట్టి అక్కడే ఒకేసారి అందుబాటులోనికి వచ్చే గుణం కలిగింది. దీని ప్రచురణ పద్ధతి భిన్నమైంది. పూర్తిగా ఇది భిన్న మాధ్యమానికి చెందింది. ఇందువల్ల తెలుగు సాహిత్యం ఆమాటకు వస్తే భారతీయ భాషలలోని సాహిత్యం కొత్త మాధ్యమంలోనికి చేరింది అని చెప్పవచ్చు. అదే విద్యున్మాధ్యమం. కవిత్వం ఈ మాధ్యమంలో వస్తూ ఉంది. కాని ఇంకా కథలు నవలలు కూడా ఈ మాధ్యమంలోనికి రావలసి ఉంది. కవిత్వం నిర్నిబంధంగా వస్తూ ఉంది. కాని కవి తనకవిత్వపు పుస్తకాలను బయట అమ్ముకున్నట్లుగా జాలంలో రాసిన తన కవిత్వాన్ని అమ్ముకునే పరిణామం ఇంకా రాలేదు. సాంకేతికంగా ఇది సాధ్యమే. ఒక కవి తన బ్లాగులో రాసి పెట్టుకున్న కవిత్వాన్ని పాస్ వర్డ్ సాయంతో నిబంధించి తనకు క్రెడిట్ కార్డు ద్వారా తను కోరిన డబ్బు చెల్లించిన వారికే తన కవితను అందుబాటులోనికి తెచ్చే వీలుంది. ఇంత పరిణామం వచ్చే వీలు కాని తెలుగు కవిత్వాన్ని అలా కొనుక్కుని చదువుకునే రోజు కాని వస్తుందని అనుకోవడం ఇప్పట్లో పేరాశే. కాని రావాలని కోరుకోవడం లో తప్పు లేదు. చాలా సామాజిక శాస్త్రాలకు చెందిన వ్యాసాలను ఆయా ప్రచురణ కర్తలు చెల్లింపు ద్వారా నెట్లో అమ్మేందుకు పాస్ వర్డ్ రక్షణ పెట్టుకోవడం ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. ఈ పద్ధతి భారతీయ భాషలకు కూడా రావాలని కోరుకుందాం. ఇంటర్ నెట్ ను అంతర్జాలం అని అంటున్నాము. క్లుప్తంగా నెట్ ను జాలము అని జాలిక అని వ్యవహరించవచ్చు. అలాగే జాలములో లభించే సాహిత్యాన్ని జాలంలో ప్రచురితమయ్యే సాహిత్యాన్ని జాల సాహిత్యము అనే కొత్త వింగడింపు చేసుకొని వ్యవహరించవచ్చు. తెలుగులో ఇప్పుడిప్పుడే వర్థిల్లుతున్న జాలసాహిత్యాన్ని ఈ పేరుతో వ్యవహరించడమే కాదు ఇక పైన దీని పరిణామాన్ని విశ్లేషించుకునేటప్పుడు ఈ సాహిత్యం విద్యున్మాధ్యమ సాహిత్యం అనే వర్గీకరణతో గుర్తిద్దాం.
బ్లాగు అనే మాట కూడా ఇప్పుడిప్పుడే తెలుగులో వ్యాప్తం చెందుతూ ఉంది. బ్లాగులు రాసేవారిని బ్లాగరి అని నేను నా మిత్రులు వ్యవహరిస్తూ ఉన్నాము. దీన్ని పూర్తిగా తెలుగులో చెబుదాం. బ్లాగును జాలవేది అని అందాం. వేది అని అంటే వేదిక అని అర్థం ఉంది. అంతే కాదు వేది అంటే విదుడు అంటే బాగా తెలిసినవాడు అని విజ్ఞాని అని అర్థాలు కూడా ఉన్నాయి. అందువల్ల బ్లాగు అనేది ఒక రచయిత మాట్లాడే ఒక వేదికగా తనరచనలకు ప్రచురణస్థానంగా ఉంది కనుక బ్లాగును చక్కగా జాలవేది అని పిలుచుకోవచ్చు. ఈ రకంగా ఇలా జాలస్థలంలో సృజించబడే సాహిత్యాన్ని జాల సాహిత్యం అని కొత్తగా వర్గీకరించుకొని ముందుకు సాగుదాం. దీని పైన మిత్రులు తమ స్పందనలు ఇవ్వాలని మీ ముందుకు నా ఆలోచనలను తెస్తున్నాను.
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి
డీన్, స్కూల్ ఆఫ్ హ్యూమన్ అండ్ సోషల్ సైన్సెస్
ద్రావిడ విశ్వవిద్యాలయం
కుప్పం